జూన్ నుంచి సెప్టెంబర్‌ ఇండియాలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం. అప్పటి వరకు వేసవి తాపంతో అల్లాడిపోయిన జనం జూన్ వచ్చిందంటే ఒక్కసారిగా ఉపశమనం పొందుతారు. ఈ ఉపశమనంతోపాటు వ్యాధులు కూడా ప్రజలను చుట్టుముడతాయి. మిగతా కాలాలతో పోలిస్తే వర్షాకాలంలో వైరస్‌లు, బ్యాక్టీరియా, ఇతర ఇన్‌ఫెక్షన్‌లకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గాలిలో విపరీతమైన తేమ, వర్షాల సమయంలో నీటి నిల్వల కారణంగా నీటి కుంటల్లో సూక్ష్మజీవులు వృద్ధి చెంది దాడి చేస్తాయి. 


వర్షాకాలంలో వచ్చే ఈ రకమైన వ్యాధులు రోగనిర్ధారణకు దారితీయక ముందే త్వరగా వ్యాప్తి చెందుతాయి. ప్రాథమిక పరిశుభ్రత, నివారణ చర్యలు, ముందస్తు కచ్చితమైన రోగనిర్ధారణ చేసుకోవడం, తగిన చికిత్సను అనుసరించి ఈ వ్యాధుల బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండొచ్చు. 


వర్షాకాలంలో వచ్చే రోగాలివే 


మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, జికా వంటి వ్యాధులను వ్యాప్తి చేసే దోమల సంతానోత్పత్తి ఈకాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులే భారత్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సీజన్ వచ్చిందంటే చాలు ఆసుపత్రులు కిక్కిరిసిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా మలేరియా కేసుల్లో 11%, డెంగ్యూ కేసుల్లో 34% ఇండియాలోనే ఉంటున్నాయి. దోమల నివారణ మార్గాలు అనుసరించడం, దోమలు రాకుండా దోమ తెరలు వాడుకోవడం ఉత్తమ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. 


వైరల్ ఫీవర్, జలుబు, దగ్గు, గొంతు నొప్పి మొదలైన వాటికి దారితీసే సాధారణ ఫ్లూ, ఇన్‌ఫ్లుఎంజా, ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్‌లకు గురయ్యే ప్రమాదం వర్షాకాలంలో పెరుగుతుంది. ఇవి చాలా సులభంగా వ్యాపిస్తాయి. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, సీనియర్ సిటిజన్లు, రోగనిరోధక శక్తి లేని వ్యక్తులు, పిల్లలపై తీవ్రప్రభావం చూపుతాయి. వాళ్లే త్వరగా అనారోగ్యం బారిన పడతారు. 


లైట్‌ తీసుకోవద్దు


కలరా, టైఫాయిడ్, హెపటైటిస్ A, E వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు, ఇతర అంటువ్యాధుల కారణంగా కూడా అనారోగ్యం పాలుకావచ్చు. కొన్ని సార్లు ఇవి ప్రాణాంతకంగా కూడా మారే ప్రమాదం ఉంది. ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల మరణాలకు ఈ వ్యాధులు కారణం కావచ్చు. మరిగించిన నీటిని తీసుకోవడం, బయట ఫుడ్‌ను తీసుకోకపోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలను నీట్‌గా ఉంచడం, పిల్లలకు టీకాలు వేసుకోవడం ద్వారా ఈ జబ్బుల  నుంచి బయటపడొచ్చు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను నిర్ధారించడం వంటి కొన్ని నివారణ, ముందు జాగ్రత్త చర్యలు నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి సహాయపడతాయి. 


లెప్టోస్పిరోసిస్ అనేది వర్షాకాలంలో కలుషితమైన నీరు, బురదలో తిరగడం ద్వారా వ్యాపించే మరొక వ్యాధి. ఒక వ్యక్తికి గాయం అయినట్లయితే ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు దాన్ని కప్పి ఉంచేలా చూసుకోవాలి. లేకుంటే అది ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి చిన్నచిన్న నిర్లక్ష్యాలే పెను ప్రమాదానికి దారి తీస్తాయి.


ఆలస్యమైతే ప్రమాదం 
 
స్క్రబ్ టైఫస్ ఫీవర్ అనేది జూనోటిక్ వ్యాధి. ఇది ఓరియంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియాతో సోకిన చిగ్గర్ మైట్ కాటు ద్వారా వ్యాపిస్తుంది. గడ్డి ప్రాంతాలు, దట్టమైన అరణ్య ప్రాంతాల్లో, ఎలుకలు ఎక్కువ తిరిగే ఏరియాలో ఉన్న వ్యక్తులకు ఇది సోకే ప్రమాదం ఉంది. రోగ నిర్ధారణ, చికిత్స ఆలస్యం అయినట్లయితే స్క్రబ్ టైఫస్ ప్రాణాంతకం కావచ్చు. 


ముందే మేల్కొండి


రోగ లక్షణాలు సాధారణంగా ఉన్న కారణంతో కోవిడ్-19, ఇతర వర్షాకాల వ్యాధుల మధ్య తేడాను గుర్తించడం కష్టమవుతోంది. ఎక్కువ రోజుల పాటు సాధారణ లక్షణాలతో బాధపడుతుంటే అనుమానించి పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. ముందస్తుగా మేల్కొని పరీక్షలు చేసుకుంటే కరోనా లాంటి వ్యాధుల నుంచి కూడా రక్షణ పొంద వచ్చు. 


ట్రూనాట్ ఈ వర్షాకాల వ్యాధులన్నింటిని ముందస్తుగా, కచ్చితమైన రోగనిర్ధారణను సులభతరం చేస్తుంది. వ్యాధి బారిన పడిన రోజు నుంచే తగిన చికిత్సను ప్రారంభించడంలో సహాయపడుతుంది. ట్రూనాట్ వంటి సాంకేతికత మెరుగైన ఫలితాలు ఇవ్వడమే కాకుండా వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించగలదు.