పునరుత్పత్తికి ఆడవారిలో అండాలు, మగవారిలో వీర్య కణాలు చాలా ముఖ్యమైనవి. ఈ రెండింటి కలయకే పిండంగా మారి భవిష్యత్తు తరాలను అందిస్తుంది. అయితే కొంతమంది మగవారిలో వీర్య కణాలు తక్కువగా ఉంటాయి. వీరికి పిల్లలు పుట్టే అవకాశం తక్కువగానే ఉంటుంది. కానీ కొన్ని రకాల పనులు, ఉద్యోగాలు చేసే పురుషుల్లో మాత్రం వీర్య కణాల సంఖ్య అధికంగా ఉన్నట్టు ఒక హార్వర్డ్ అధ్యయనం తేల్చింది. ఏ పురుషులు అయితే తమ ఉద్యోగంలో లేదా పనుల్లో భాగంగా బరువైన వస్తువులను ఎత్తడం, కదిలించడం వంటివి రోజూ చేస్తారో... అలాంటివారు ఎక్కువ వీర్య కణాల సంఖ్యను కలిగి ఉంటారని ఈ అధ్యయనం చెబుతోంది.
హ్యూమన్ ప్రొడక్షన్ జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురించారు. సంతానోత్పత్తిపై పర్యావరణం, జీవనశైలి ఏ రకంగా ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవడం కోసం ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో భాగంగా 377 మంది మగవారిని ఎంపిక చేశారు. వారు చేసే ఉద్యోగాలు, పని, బరువులు ఎత్తడం, బరువైన వస్తువులు కదిలించడం.. ఇలాంటి సమాచారాన్ని సేకరించారు. వీరిలో తమ ఉదోగ్యంలో భాగంగా బరువైన వస్తువులను ఎత్తడం, తరలించడం వంటి పనులు చేసేవారిలో... మిగతా వారితో పోలిస్తే 46% వీర్యకణాల సాంద్రత, 44% వీర్యకణాల సంఖ్య అధికంగా ఉన్నట్టు గుర్తించారు. అంటే రోజూ శారీరక శ్రమ పడే పురుషుల్లో స్పెర్మ్ కౌంటు అధికంగా ఉన్నట్టు ఈ హార్వర్డ్ అధ్యయనం తేల్చింది.
అయితే శారీరక శ్రమ అధికంగా ఉండే ఉద్యోగాలు, వీర్యకణాల మధ్య ఉన్న సంబంధాన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి ఇంకా లోతైన పరిశోధనలు అవసరమని హార్వర్డ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రజల సంతాన ఉత్పత్తిని మెరుగుపరచడానికే వారు ఈ అధ్యయనాలు పరిశోధనలు చేస్తున్నట్టు చెప్పారు.
జింక్ అవసరం...
మగవారిలో వీర్యకణాలు నాణ్యత, చలనశీలత, సంఖ్య వంటివి జింక్ పై ఆధారపడి ఉంటాయి. జింక్ లోపం ఉంటే వీర్య కణాలపై ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాల్సిన అవసరం ఉంది. బార్లీ, రెడ్ మీట్, బీన్స్ వంటి వాటిలో జింక్ పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ తినాలి.
మన శరీరం తనకు తానుగా జింక్ ఉత్పత్తి చేయలేదు. అలాగే నిల్వ కూడా చేసుకోలేదు. రోజూ తినాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం ఏటా కేవలం జింక్ లోపం వల్లే అనేక రోగాల బారిన పడి 8 లక్షల మంది మరణిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నట్టు లెక్క.
Also read: పెరుగు-పంచదార కలుపుకొని తినే అలవాటు మీకుందా? అదెంత హానికరమో తెలుసుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.