AP News: అమరావతి కోర్టు ధిక్కరణ కేసులో రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. సోమవారం రోజు ఆయన విచారణకు హాజరు కాగా.. కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే విచారణను వచ్చే నెల 20కి వాయిదా వేసింది. మాజీ డీజీపీ, ప్రస్తుత ఏపీపీఎస్పీ ఛైర్మన్ గొతమ్ సాంగ్ కూడా కోర్టుకు రావాల్సి ఉంది. కేరళలలో సమావేశానికి హాజరు అయినందున రాకపోతున్నందుకు మన్నించాలని, తదుపరి విచారణకు హాజరు అవుతానని ఆయన అఫడవిట్ దాఖలు చేశారు. న్యాయస్థానం అందుకు సానుకూలంగా స్పందించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావు సోమవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. 1999లో జారీ చేసిన జీవో 257 ప్రకారం విజయనగరం జిల్లా పోలీసు శిక్షణ కళాశాలలో ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న సీహెచ్ రాజశేఖర్ కు పదోన్నతి కల్పించే వ్యవహారాన్ని పరిగణలోకి తీసుకోవాలని 2019 సెప్టెంబర్ 24వ తేదీన హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. 


ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో రాజశేఖర్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి... పూర్వ డీజీపీ, ప్రస్తుత డీజీపీలు హాజరు కావాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే సోమవారం జరిగిన విచారణకు ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి హాజరు అయ్యారు. ఆయన తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ వాదనలు వినిపిస్తూ... రాజశేఖర్ ఏసీఆర్ సంతృప్తికరంగా లేదని అన్నారు. ఆయన పదోన్నతి ప్రతిపాదనను డిపార్ట్ మెంటల్ పదోన్నతి కమిటీ తిరస్కరించిందని చెప్పుకొచ్చారు. పూర్తి వివరాలతో కొంటర్ వేసేందుకు సమయం కావాలని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై న్యాయమూర్తి స్పందిస్తూ.. పదోన్నతి కల్పించే విషయంలో అన్ని అంశాలను పునఃపరిశీలన చేయాలని సూచించారు. కౌంటర్ వేసేందుకు సమయం ఇస్తూ విచారణను వాయిదా వేశారు. తదుపరి విచారణకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి రాకపోయినా ఫర్వాలేదంటూ మినహాయింపు ఇచ్చారు.