Chikoti Praveen: క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ వరుస వివాదాల్లో ఇరుక్కుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మరోసారి ఆయనకు ఐటీ నోటీసులు జారీ చేసింది. రూ.3 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ కారు విషయంలో ఈసారి ఐటీ నుంచి నోటీసులు అందుకున్నారు చికోటి. అయితే చికోటి బినామీ పేరు మీద ఓ కారును కొనుగోలు చేశారు. భాటియా ఫర్నిచర్ పేరుతో చికోటి కారును కొనుగోలు చేశాడు. ఇప్పటికే చికోటి ఫెమా కేసును ఎదుర్కుంటుండగా.. క్యాసినో కేసులో ఇంకా విచారణ సాగుతోంది. ఇలా వరుస కేసుల విచారణతో చికోటి నలిగిపోతున్నారు.
సిరామిక్ టైల్స్ వ్యాపారిగా జీవితాన్ని ప్రారంభించిన చికోటి ప్రవీణ్ కుమార్.. ఆ తర్వాత నిర్మాతగా మారిపోయాడు. కానీ అనుభవం లేక చాలా నష్టపోయాడు. అప్పుల ఊభిలో కూరుకుపోయాడు. వాటి నుంచి బయటపడేందుకు వనస్థలిపురంలోని ఓ వైద్యుడిని కిడ్నాప్ చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఆ తర్వాతే గోవాలో ఓ పేకాట క్లబ్ లో కొన్ని టేబుళ్లను అద్దెకు తీసుకొని పేకాట నిర్వహించడం మొదలు పెట్టాడు. చికోటి ప్రవీణ్ తొలినాళ్లలో కేవలం జంట నగరాల్లో అది కూడా సెలబ్రిటీల కోసమే క్యాసినో నిర్వహించాడు. కానీ అది ఆ తర్వాత పెద్ద పెద్ద వారందరితో పరిచయాలు ఏర్పడేలా చేసింది. దీంతో అటు రాజకీయ, ఇటు సినీ పెద్దలతో పరిచయాలు.. ఆయన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేలా చేశాయి.
చిన్నగా మొదలైన ఆయన వ్యాపారం అతి తక్కువ కాలంలోనే రాష్ట్రాలు, దేశాలు దాటి విస్తరించింది. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, డీసీసీబీ ఛైర్మన్లు సైతం చికోటి కస్టమర్ల లిస్టులో ఉన్నారట. కార్ల నుంచి మొదలైన ఈయన ప్రస్థానం ప్రత్యేక విమానాల్లో ఇండోనేషియా, నేపాల్ కు కస్టమర్లను తీసుకెళ్లి కోట్ల రూపాయలతో పేకాట ఆడించే స్థాయికి చేరుకున్నాడట. గతంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ నిర్వహించిన సోదాలతో చికోటి చీకటి సామ్రాజ్యపు పునాదులు కదలడం ప్రారంభించాయి.
ఇటీవలే దొంగతనానికి గురైన చికోటి కారు..
క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కుమార్ కారు చోరీకి గురైంది. సైదాబాద్ లోని ఆయన సొంత ఇంట్లో ఉన్న కారును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. ఇన్నోవా కారు కీస్ వెతికి మరీ కారుతోపాటు పరారయ్యారు. అయితే విషయం గుర్తించిన చీకోటి ప్రవీణ్ పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా చీకోటి ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజిని పరిశీలించారు పోలీసులు. అందులోనే కారు దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. అందులో ఉన్న నిందితుల ఫొటోలను ప్రింట్ తీసిన పోలీసులు వారిని పట్టుకునే పనిలో పడ్డారు. పోలీస్ ప్రొటెక్షన్ కావాలంటూ గతంలో ప్రవీణ్ కుమార్.. పోలీసులను కోరిన విషయం అందరికీ తెలిసిందే. తనకు, తన కుటుంబానికి రక్షణగా గన్ మెన్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రవీణ్ కోరారు.