టీ ఒక పానీయం అనే కన్నా ఒక భావోద్వేగం అని చెప్పుకోవడం బెటర్. ఎందుకంటే టీ తాగే అలవాటు ఉన్నవారు ఒక్కరోజు ఆ పానీయాన్ని తాగకపోయినా, వారి మానసిక స్థితిలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. తలనొప్పిగా ఉందని, మూడ్ అవుట్ గా ఉందంటూ పనులు కూడా చేయలేరు. అంతగా వారి మానసిక స్థితి టీ తో ముడి పడిపోతుంది. రోజుని ప్రారంభించాలంటే వారికి అవసరమైన శక్తినిచ్చేది టీనే. అయితే పరగడుపున ఖాళీ పొట్టతో టీ తాగడం అంత సురక్షితం కాదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఇది నిశ్శబ్దంగా జీర్ణ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని అంటున్నారు.


3000కు పైగా..
ప్రపంచంలో మూడు వేల కంటే ఎక్కువ రకాల టీలు ఉన్నాయి. ఎక్కువమంది ఇష్టపడే పానీయాలలో టీది మొదటి స్థానం. ఎంత ఇష్టమైనా కూడా ఖాళీ పొట్టతో మాత్రం టీ తాగవద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మన దేశంలో చాలామంది తమ రోజును పాలతో చేసిన టీ తోనే ప్రారంభిస్తారు. కొంతమంది పాలు వేయకుండా చేసే బ్లాక్ టీని కూడా తాగుతారు. పరగడుపున ఈ తేనీరు తాగడం వల్ల అల్సర్లు, కడుపు ఉబ్బరం, పొట్ట అసౌకర్యంగా ఉండడం, జీర్ణ రుగ్మతలు వంటివి భవిష్యత్తులో వచ్చే అవకాశం ఎక్కువ. బ్రష్ కూడా చేయకుండా టీ తాగే అలవాటు ఎంతో మందికి ఉంటుంది. దీనివల్ల నోటిలోని బ్యాక్టీరియా పొట్ట వరకు చేరుతుంది.పేగు అనారోగ్యానికి దారితీస్తుంది. అలాగే ఖాళీ పొట్టతో అధిక కెఫీన్ ఉండే పానీయాలు తాగడం వల్ల గుండెల్లో మంట, పొట్ట ఉబ్బరం, నొప్పి, అల్సర్ వంటివి పెరుగుతాయి. యాసిడ్ రిఫ్లెక్స్ కు దారితీస్తుంది. పరగడుపున టీ తాగడం వల్ల ఎక్కువ మంది డిహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. ఎందుకంటే టీ తాగే వారిలో మూత్ర విసర్జన అధికంగా అవుతుంది. దీనివల్ల శరీరంలోని ద్రవాలు మూత్రం ద్వారా బయటికి పోతాయి. దీంతో తీవ్రమైన నిర్జలీకరణకు శరీరం గురవుతుంది. అంటే డీహైడ్రేషన్ బారిన పడుతుంది. 


పరగడుపున టీ తాగడం వల్ల శరీరం ఎదుగుదలపై కూడా ప్రభావం పడుతుంది. టీలో ఉండే టానిన్లు ఆహారం నుండి ఇనుమును ఇతర పోషకాలను గ్రహించడంలో అడ్డుపడుతుంది. దీనివల్ల శరీరం పోషకాహార లోపం బారిన పడుతుంది.దీన్ని కేవలం ఒక పానీయంగా మాత్రమే చూడాలి. దానికి బానిసగా మారితే ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది.


ఇంట్లోనే హెర్బల్ టీ తయారు చేసుకొని తాగితే ఎలాంటి సమస్యలు ఉండవు. జీలకర్ర, పసుపు, వేప, తులసి, నిమ్మ వంటి మూలికలతో ఇంట్లోనే టీ ని తయారు చేసుకోవచ్చు. అలాంటి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో కెఫీన్ లాంటివి ఉండవు. ఆరోగ్య వ్యవస్థను ఇవి నాశనం చేయవు. శరీరానికి ఎంతో ఉపశమనాన్ని అందిస్తాయి. బ్యాక్టీరియాను బయటికి పంపించడంలో ముందుంటాయి. గుండెల్లో మంట వంటి సమస్యలు ఇంట్లో తయారు చేసుకునే హెర్బల్ టీలలో ఉండదు.


Also read: డయాబెటిస్ ఉన్నవారు చెరుకు తినవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారు?









































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.