ఎలా వెళ్తామో తెలియదు.. ఎప్పుడు వెళ్తామో తెలియదు. కానీ పడి పోయే టైంలో మాత్రం తెలుస్తుంది. మనం ఎత్తైన ప్రదేశంలో ఉన్నామని.. అక్కడి నుంచి పడిపోతున్నామని మనకు తెలుస్తుంది. కింద పడే సరికి మన గొంతు నుంచి పెద్దగా అరుపు వినిపిస్తుంది. ఇంతలో పక్కన ఉన్న వాళ్లు ఒక్కటిస్తారు. అంతే వెంటనే లేచి కూర్చుంటాం. అప్పుడు తెలుస్తుంది ఇదంతా కల అని. 


ఇలాంటి కలలు చాలా మందిని వేధిస్తుంటాయి. ఉదయం లేచిన వెంటనే ఆ కల గురించి ఎవరికైనా చెబితే రకరకాల స్టోరీలు చెబుతారు. అలాంటి కలలు రాకూడదని.. వచ్చే జీవితంలో సమస్యలు ఎదుర్కొంటామని భయపెట్టేస్తారు. మరికొందరైతే.. మీరు గానీ, మీకు సంబంధించిన వాళ్లకు ప్రాణ హాని ఉందని మరింత టెన్షన్ పెడతారు. 


ఇంత చర్చకు కారణవుతున్న ఈ కలపై సైన్స్ ఏం చెబుతుంది. ఎత్తైన హైట్స్‌ నుంచి పడిపోయే కల ఎందుకు వస్తుందని సైకాలజిస్టులు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మన లైఫ్‌లో కలలు భాగం. సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ చెప్పినట్టు కలలు మన మెంటల్ స్టెబిలిటీని వివరిస్తాయట. రెగ్యులర్‌గా మనం చేసే పనులు, చూసే వ్యక్తులు, మానసిక ఆందోళనలే కలల రూపంలో వస్తాయన్నది ఆయన చెప్పే నిర్వచం.  


ఎత్తైన ప్రదేశాల నుంచి పడిపోవడం సర్వసాధారణంగా చాలా మందికి వచ్చే కల. అలా కల వస్తే మన పని అవుట్‌ అంటూ రకరకాల కథలు ప్రచారం చేస్తుంటారు శాస్త్రం తెలియని వారంతా. కానీ సైకాలజిస్టులు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఇలాంటివి నమ్మి ఆందోళనకు గురి కావద్దని సూచిస్తున్నారు. 


ఎత్తైన ప్రదేశాల నుంచి కింద పడుతున్నట్టు కల వచ్చిందంటే.. మీరు రెగ్యులర్‌ లైఫ్‌లో ఇబ్బంది పడుతున్నారని సైకాలజిస్టులు చెబుతున్నారు. మీరు చేస్తున్న పనిలో గానీ, చదువులోగానీ, మీ నడవడికలో గానీ మార్పులు అవసరమని ఈ కల  చెబుతుందట. చేస్తున్న పనిలో పునరాలోచన అవసరం చెప్పే సూచకట. కొత్త దారిలో వెళ్లాలనే సంకేతంగా ఈ కలను మలుచుకోవాలంటున్నారు. 


మనం రెగ్యులర్‌ లైఫ్‌లో చాలా పనులు చేస్తుంటాం. చాలా మందితో మాట్లాడుతుంటాం. కానీ అందులో కొన్నింటిని మనం మనసు పెట్టి చేయలేకపోవచ్చు. ఆ గిల్ట్‌ మనల్ని పట్టి పీడిస్తుంది. అలాంటి సమయంలో ఎత్తైన ప్రదేశాల నుంచి పడిపోయే కలలు వస్తాయని మానసిక శాస్త్రం చెబుతోంది.


ఇలాంటి కలలు వచ్చినప్పుడు ఏదో జరిగిపోతుందన్న ఆలోచన వద్దని చెబుతున్నారు మానసిక శాస్త్రవేత్తలు. అసలు అలాంటి కలలు ఎందుకు వచ్చాయో విశ్లేషణ చేయమంటున్నారు. అంతే కానీ తమో, దగ్గరి వాళ్లో చనిపోతారో అన్న కంగారు వద్దని సూచిస్తున్నారు. కలలు వచ్చేందుకు దోహదం చేసిన సంఘటనలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలని సలహా ఇస్తున్నారు. 


మన రెగ్యులర్‌ లైఫ్‌లో చాలా చిన్నచిన్న తప్పులు జరుగుతుంటాయని మనం వాటిని గుర్తు పెట్టుకోలేమని... మన సబ్‌కాన్సియస్‌ బ్రెయిన్ మాత్రం గుర్తిస్తుందని చెబుతోంది సైకాలజీ. ఇలాంటి కలలు వచ్చినప్పుడు మనకు గుర్తున్నంత వరకు రాసుకోవాలి. తర్వాత మన డైలీ లైఫ్‌ స్టైల్‌ రాసుకుంటే ఎందుకు ఆ కలలు వస్తున్నాయే ఈజీగా అర్థమవుతుందంటున్నారు సైకాలజిస్టులు.