దేశంలో కరోనా కేసులు మరోసారి 20 వేలకు దిగువనే నమోదయ్యాయి. పండుగ సమయం దగ్గర పడుతోన్న వేళ కరోనా కేసులు తగ్గడం కొంత ఊరటనిస్తోంది. కొత్తగా 18,132 కేసులు నమోదుకాగా 193 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 21,563 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- యాక్టివ్ కేసులు: 2,27,347
- మొత్తం రికవరీలు: 3,32,93,478
- మొత్తం మరణాలు: 4,50,782
- మొత్తం వ్యాక్సినేషన్: 95,19,84,37
కేరళ..
కేరళలో కొత్తగా 10,691 కరోనా కేసులు నమోదుకాగా 85 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 47,94,800కు చేరగా మరణాల సంఖ్య 26,258కి పెరిగింది.
మొత్తం 14 జిల్లాల్లో ఎర్నాకులంలో అత్యధికంగా 1,639 కేసులు నమోదయ్యాయి. త్రిస్సూర్ (1,378), తిరువనంతపురం (1,197), కోజికోడ్ (976) కేసులు నమోదయ్యాయి.
ఓనం పండుగ సమయంలో కేరళలో రోజుకు 30 వేల కేసులు నమోదవగా ప్రస్తుతం 10 వేల కేసులకు పడిపోవడం కొంత ఊరటనిస్తోంది.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కొత్తగా 2,294 కరోనా కేసులు నమోదుకాగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,823 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
జోరుగా వ్యాక్సినేషన్..
కరోనా వైరస్‌పై పోరాటంలో భారత్ మరో మైలు రాయికి దగ్గర్లో ఉంది. కరోనా వైరస్ టీకాల పంపిణీలో అత్యంత వేగంగా 95 కోట్ల వ్యాక్సిన్ పంపిణీలను పూర్తి చేసుకున్న భారత్ 100 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది.
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ జనవరి 16 నుంచి మొదలైంది. మొదటి విడతగా ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఫిబ్రవరి 2 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకాలు అందించారు. తర్వాత మార్చి 1 నుంచి 60 ఏళ్ల వయోజనులకు అనంతరం ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ జరగగా మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది.
Also Read:India China Military Talks: మళ్లీ అదే కథ.. భారత్- చైనా సైనిక చర్చల్లో ఫలితం శూన్యం