కోవిడ్ నుంచి కోలుకుని స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న ప్రజానీకాన్ని మరోసారి మాయదారి వైరస్ భయాందోళనలకు గురిచేస్తోంది. చైనాలో ఇప్పటికే బీభత్సం సృష్టిస్తోన్న ఒమిక్రాన్ కొత్త వేరియెంట్.. ఇండియాలోకి కూడా ప్రవేశించింది. ప్రస్తుతం ఆ కేసులు తక్కుగానే ఉన్నా.. దాని వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతేకాదు, ఈ కొత్త వేరియెంట్‌ను సాధారణ కోవిడ్-19 పరీక్షల్లో కూడా తెలుసుకోలేమని అంటున్నారు. అందుకే, మాస్క్ పెట్టుకుని జాగ్రత్తగా ఉండటం బెటర్. 


చైనాలో దయనీయ పరిస్థితులు: డెల్టా వేరియెంట్ తరహాలోనే చైనాలో ఒమిక్రాన్ BF.7 పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటివరకు 37 మిలియన్ మంది ఈ వైరస్‌‌తో చికిత్స పొందుతున్నారు. రోజుకు 5 వేల మంది చొప్పున మరణాలు చోటుచేసుకుంటున్నాయని చైనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్ వ్యాప్తి చెందిన తర్వాత ఇంత స్థాయిలో కేసులు నమోదు కాలేదని, ఇదే అత్యధికమని చైనా చెబుతోంది. గత 20 రోజుల్లో సుమారు 248 మంది ఈ వైరస్‌కు గురైనట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి. బీజింగ్‌లో కేసులు అత్యధికంగా ఉన్నట్లు పేర్కొన్నాయి. 


కలవరం వద్దు, కానీ..: ఒమిక్రాన్ BF.7 వేరియెంట్ కేసులపై భయాందోళనలు అక్కర్లేదని, కనీస జాగ్రత్తలను పాటించడం ద్వారా వ్యాప్తిని అడ్డుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, శానిటైజర్లు వాడటం తప్పనిసరి. గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన ప్రముఖ సైంటిస్ట్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ఒమిక్రాన్ BF.7 ఇండియాలో ఎప్పుడో గుర్తించారు. అయితే, అది ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్ కావడం వల్ల ఆందోళన చెందలేదు. చైనాతో పోల్చితే BF.7 వేరియెంట్ ఇండియాలో వేగంగా లేదు. అయితే, దీన్ని తక్కువగా అంచనా వేయకూడదు. తప్పకుండా అంతా మాస్కులు ధరించాలి’’ అని తెలిపారు. 


Omicron BF.7 వేరియంట్ ప్రమాదకరమా?


చైనాలో కోవిడ్ సంబంధిత మరణాల సంఖ్య మిలియన్లలో పెరిగే అవకాశాలున్నట్లు ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీగల్-డింగ్ పేర్కొన్నారు. 90 రోజుల్లో దాదాపు 60% మంది చైనా జనాభా ప్రభావితమవుతుందని అంచనా వేశారు. BF.7 రోగనిరోధక శక్తిని ఎదుర్కోగలదు. కాబట్టి, కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నా, ఇదివరకు కోవిడ్-19 సోకినవారికి సైతం ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. WHO ఇప్పటికే ప్రపంచ దేశాలను హెచ్చరించింది. వైరస్ తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని పేర్కొంది. BF.7 వేరియెంట్ గతంలో కనుగొన్న ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది. అలాగే దీన్ని రోగనిరోధక వ్యవస్థ ద్వారా గుర్తించడం కూడా కష్టమే. ఎందుకంటే, లక్షణాలు అంత త్వరగా కనిపించవు. అయితే, కొన్ని లక్షణాల ద్వారా దీన్ని గుర్తించి చికిత్స పొందవచ్చు. లేకపోతే ప్రాణాలకే ‘డెల్టా’ వేరియెంట్ తరహాలోనే ప్రాణాలు తీసే ప్రమాదం ఉందంటున్నారు. చైనాలో ఉన్న పరిస్థితిని బట్టి చూస్తుంటే.. ప్రజలు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాల్సిందే. 


ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్-19 మార్గదర్శకాలు


⦿ ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాలి. సామాజిక దూరాన్ని పాటించాలి. ముఖ్యంగా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, మెట్రోలు, మెట్రో స్టేషన్లు మొదలైన రద్దీ ప్రదేశాలలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్త ఉండాలి. 


⦿ ఎలాంటి ఇన్ఫెక్షన్‌ను నివారించేందుకు వీలైనంత త్వరగా వారి బూస్టర్ డోస్ తీసుకోవాలి. ముఖ్యంగా రోగనిధోక శక్తి తక్కువగా ఉన్నవారు, వృద్ధులు వ్యాక్సిన్స్ తీసుకోవాలి. 


⦿ విమానంలో ప్రయాణించాలంటే తప్పకుండా మీరు వ్యాక్సిన్ తీసుకుని ఉండాలి. అలాగే మాస్క్ తప్పకుండా పెట్టుకోవాలి.  


⦿ మీలో కోవిడ్ లక్షణాలు ఉన్న ప్రయాణీకులను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి పరీక్షలు, చికిత్సలు నిర్వహిస్తారు. 
 
ఒమిక్రాన్ BF.7 లక్షణాలు


ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కొత్త వేరియంట్ లోని లక్షణాలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్‌ను పోలి ఉంటుంది. చలికాలంలో వచ్చే వ్యాధుల లక్షణాలే అని నిర్లక్ష్యం అస్సలు చేయొద్దు. ఎందుకంటే.. ఈ వేరియెంట్ సైలెంట్ కిల్లర్. సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ల తరహా లక్షణాలతో కనిపించే మహమ్మారి. కాబట్టి, ఈ లక్షణాలు తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి. మీ బంధుమిత్రులకు కూడా తెలియజేయండి. 


⦿ జ్వరం
⦿ గొంతు మంట
⦿ ముక్కు కారడం
⦿ దగ్గు
⦿ జలుబు, ఫ్లూ
⦿ కొన్ని సందర్భాల్లో కడుపు నొప్పి
⦿ అతిసారం


Also read: పొట్ట క్లీన్ అవ్వాలా? ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలు ఇవిగో











గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.