జీడి పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ, కొవ్వు పెరిగిపోతుందనే భయంతో చాలా తక్కువగా తింటుంటాం. అయితే జీడి పప్పు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు అస్సలు దూరం పెట్టారు. అవేంటో చూసేయండి మరి.
జీడి పప్పుతో గుండె పదిలం: నేషనల్ సెంటర్ ఫర్ బయో టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) నివేదికల ప్రకారం జీడి పప్పు చాలా రకాల రోగాలతో పాటు గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీడి పప్పును తరచుగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని తేలింది. జీడి పప్పును రోజు తినడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి, వాస్కులర్ రియాక్టివిటీ వంటి సమస్యలే ఉండవట. వాపును కూడా తగ్గిస్తుందట. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు గుప్పెడు జీడిపప్పులు తింటే చాలట. జీడిపప్పులో ఉండే ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటి ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటి కార్సినోజెనిక్ ఎలిమెంట్స్ గా సహాయపడతాయి.
రక్తానికి సంబంధించిన రోగాలను నివారిస్తుంది: జీడిపప్పు కాపర్ గుణాలను అధికంగా కలిగి ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌ను శరీరం నుంచి బయటకు పంపడానికి ఉపయోగపడుతుంది. కాపర్ లోపంతో బాధపడేవారు జీడిపప్పును తినడం వల్ల శరీరానికి కావలసినంత కాపర్ గుణాలను అందించవచ్చు.
కంటినీ కాపాడుతుంది: సిటీల్లో వాహనాల వల్ల చాలా కాలుష్యం ఏర్పడుతుంది. ఆ కాలుష్యంలో తిరగటం వల్ల చాలా మంది తెలియకుండానే కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటారు. జీడిపప్పులో జియా క్శాంటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పిగ్మెంట్ ఉంటుంది. ఇది యూవీ కిరణాల నుంచి కంటిని కాపాడే రెటీనాను సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. వృద్ధాప్యం వల్ల వచ్చే కంటి చూపు సమస్యలను కూడా తగ్గిస్తుంది.
చర్మాన్ని సంరక్షస్తుంది: జీడిపప్పు నూనెతో చర్మానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. జీడిపప్పులో సెలీనియం, జింక్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ ఉంటాయి. ఎక్కువ శాతం సెలీనియం కలిగిన జీడిపప్పును తినడం వల్ల చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. క్యాన్సర్ ను నివారించడంలోనూ సహాయపడుతుంది.
బరువు తగ్గటానికి సహాయపడుతుంది: నిత్యం నట్స్ తినేవాళ్లను, నట్స్ అస్సలు తిననివారిపై జరిపిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. రోజూ నట్స్ తినేవారు త్వరగా బరువు తగ్గుతారని తేలింది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే జీడిపప్పు శరీరంలో కొవ్వును తగ్గించడంలో సహాయపడి, మెటబాలిజంను పెంచుతుంది. బరువు తొందరగా తగ్గాలనుకుంటే మాత్రం జీడిపప్పును ఎలాంటి పదార్థాలతో జత చేయకుండా అలాగే తినేయాలని ఆహార నిపుణులు చెబుతున్నారు. తొందరగా బరువు కోల్పోడానికి ఇదొక మంచి మార్గమని చెబుతున్నారు.
ఫైబర్ ను అందిస్తుంది: శరీరానికి అవసరమయ్యే ఒలేయిక్ యాసిడ్, పాల్మిటిక్ యాసిడ్ ను కలిగి ఉండే డైటరీ ఫైబర్స్ జీడిపప్పులో అధికంగా ఉంటాయి. ఈ ఫైబర్‌లను శరీరం ఉత్పత్తి చెయ్యదు. కాబట్టి, జీడిపప్పు తినడం ద్వారా ఆ ఫైబర్లను పొందవచ్చు. డైటరీ ఫైబర్లు ఆహరాన్ని జీర్ణం చేసుకోవడంలో సహాయపడతాయి. అలాగని అధికంగా తిన్నా సరే సమస్యే. రోజూ జీడిపప్పు తినడం వల్ల జీర్ణ క్రియకు సంబంధించిన జబ్బులకు గుడ్ బై చెప్పేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.
మెరిసే కురుల కోసం:
మీకు జుట్టు బాగా పెరగాలంటే.. జీడి పప్పులు తినండి. లేదా దాని నూనెను జుట్టుకు రాసినా బలం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. జీడిపప్పు నూనెలో వుండే కాపర్ గుణాలు మెలైన్ అనే జుట్టు పిగ్మెంటేషన్ నుంచి కాపాడి, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు రంగును పెంచడంతో పాటు మృదువుగా చేయటంలో కూడా జీడిపప్పు సహాయపడుతుంది.
Also read: చక్కెరతో జర భద్రం - ఈ భయానక వ్యాధి ప్రాణాలు తీయొచ్చు, ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.