కొందరి చేతిరాత చూస్తే కడిగిన ముత్యంలా ఉంటుంది. మరికొందరిది గజిబిజిగా గందరగోళంగా ఏమీ అర్థంకాకుండా ఉంటుంది. గ్రాఫాలజీ అంటే చేతిరాతను గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసే ఒక శాస్త్రం. దీని ప్రకారం మనలో ఉండే శారీరక, మానసిక వ్యాధులను రెండింటినీ తెలుసుకోవచ్చని చెబుతున్నారు గ్రాఫాలజిస్టులు. మరి ఈ గ్రాఫాలజీ ప్రకారం చేతి రాత ప్రకారం.. వ్యక్తుల వైఖరిని కూడా తెలుసుకోవచ్చట. అది ఎలాగో చూడండి.
ఎడమ చేతి రాత..: మనలో చాలామంది ఎడమచేతితో రాసేవారు ఉంటారు. అలా ఎడమ చేతితో స్ట్రెయిట్ గా కాకుండా.. ఏటవాలుగా రాసే వ్యక్తి నిరాశావాద వైఖరిని కలిగి ఉంటారట. వారు నలుగురితో సమయం గడపం కంటే.. తమతో తాము సమయాన్ని గడపడానికే ఎక్కువ ఇష్టపడతారట. దీనివల్ల వారు ఎక్కువగా డిప్రషన్‌కు లోనవుతుంటారు. కాబట్టి అలాంటి వారు స్ట్రెయిట్ గా కుడిచేతితో రాయడం అలవాటు చేసుకుంటే కనుక సమస్య తీరిపోతుందని చెబుతున్నారు గ్రాఫాలజిస్టులు.
వదులుగా పట్టుకుని రాయడం: ఇక కొందరు పెన్ ను వదులుగా పట్టి లైట్ గా రాస్తుంటారు. అలాంటి వారు శాంతి ప్రేమికులుగా ఉంటారట. ఎదుటివారిని త్వరగా క్షమించేస్తారట. వారికి జరిగిన చెడు విషయాల గురించి మర్చిపోవడానికే ప్రయత్నిస్తారట. ఇక ఈరకంగా రాసే వారికి బీపీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ అధిక ఒత్తిడితో పెన్ ను పట్టి రాసేవారికి మాత్రం త్వరగా కోపం వస్తుందని, వారు ఇతరులను అంత ఈజీగా క్షమించలేరనీ, ఇక వారు ఎక్కువ ఒత్తిడికి లోనై బీపీ వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
బేస్ లైన్ కింద రాసే వ్యక్తులు..: ఇక బేస్ లైన్ పైన కాకుండా కింద రాసే వ్యక్తి తీవ్రమైన ఒత్తిడి, నిరాశ చెందుతున్నాడని అర్థం. అలాంటి వారిలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వారు ప్రతీ అంశాన్ని నెగెటివ్ గా చూస్తారట. వారు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉందట. ఇక బేస్ లైన్ పైన రాసేవారు తరుచుగా మూడ్ స్వింగ్స్ కు లోనవుతుంటారట. ఏ డెసిషన్ ను అంత ఈజీగా తీసుకోలేరట. అందుకని తప్పకుండా బేస్ లైన్ పైన రాయడం నేర్చుకుంటే ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చు. బేస్ లైన్ పైనే రాసేవారు బలమైన నిర్ణయాలను కలిగి ఉండి, తమ లక్ష్యాలపట్ల ఆశాజనకంగా, చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారని చెబుతున్నారు.
అక్షరాలను అంటించి రాయడం..: ఇక అక్షరాలను ఒకదానికొకటి అంటిస్తూ గజిబిజిగా రాసే వారు ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటారు. వారి జీవితంలో కూడా ఎలాంటి డెసిషన్ ను తీసుకోలేక గందరగోళ పరిస్థితులకు లోనవుతుంటారు. ఇక వ్యాక్యాలను రాసేటప్పుడు మరీ ఎక్కువ స్పేస్ ఇస్తూ రాసేవారు ఇతరులపై ఆధారపడే అవకాశం ఎక్కువ. అలాగే తక్కువ స్పేస్ ఇస్తూ రాసే వారు బాగా అనుమానస్తులట. అందుకని పదాలను రాసేటప్పుడు సాధారణమైన దూరాన్ని పాటిస్తూ రాయడం మంచిదనీ, ఇది వారి ఆలోచనా తీరును మారుస్తుందని అంటున్నారు.
చెడు అలవాట్లను మానేయాలంటే..: మీలో ఎవరైనా స్మోకింగ్ లేదా డ్రింకింగ్ లాంటి అలవాట్లకు బానిసలైతే అలాంటి వారు వాటిని నియంత్రించుకోవాలంటే రాసే సమయంలో పేపర్ కు ఎడమ వైపు మార్జిన్ వదిలి బేస్ లైన్ పైనే రాయడానకి ప్రయత్నిస్తే ఆ అలవాట్లనుంచి దూరమయ్యే అవకాశాలున్నాయి. ఇలా వారి వారి ఆరోగ్య స్థితి, తీసుకునే మెడిసిన్ ను బట్టి, మానసిక స్థితిని అంచనా వేస్తూ మన రాతలో కాస్త మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతిరాతలో ఉంటుందని చెబుతున్నారు గ్రాఫాలజిస్టులు.