యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) చేస్తున్న, చేయబోతున్న సినిమాల లైనప్ ఓ రేంజ్‌లో ఉంది. 'బాహుబలి' తర్వాత నుంచి పాన్ ఇండియా ఆడియ‌న్స్‌ను టార్గెట్ చేస్తూ... 'సలార్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ కె', 'స్పిరిట్' చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు మరో సినిమాను ప్రభాస్ ఓకే చేశారు. మారుతి(Maruthi) దర్శకత్వంలో పని చేయడానికి రెడీ అవుతున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. రెండు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. 


'రాజా డీలక్స్' అనే పేరుని సినిమా టైటిల్ గా అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కథ, కథనాలపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదొక హారర్ స్టోరీ అని మొదటి నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ దెయ్యం ప్ర‌భాసేన‌ట‌. 'చంద్రముఖి' సినిమాలో జ్యోతిక క్యారెక్టర్ గుర్తుందా..? ఓ ఆత్మ అప్పుడప్పుడూ ఆమెని ఆవహిస్తుంటుంది. 
అలానే ప్రభాస్ సినిమాలో కూడా ఓ ఆత్మ అప్పుడప్పుడు హీరోని ఆవహిస్తుందట. ఆ సమయంలో ప్రభాస్ ప్రవర్తన వింత వింతగా ఉంటుందని.. అందులోనుంచే కామెడీ పుట్టేలా రాసుకున్నారట.


ఓ స్టార్ హీరో, యాక్షన్ హీరో.. పైగా పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరో ఇలాంటి కాన్సెప్ట్ లో నటించడం కొత్తనే చెప్పాలి. మారుతి బలం.. కామెడీ. ఈ సినిమాలో అదే హైలైట్ అయ్యేలా చూసుకుంటున్నారట. ప్రభాస్ చుట్టూ ఉండే క్యారెక్టర్లను కూడా కొత్తగా డిజైన్ చేస్తున్నారట. కథలో నిధుల అన్వేషణ అనే సబ్ లేయర్ కూడా తెలివిగా జోడిస్తున్నాడట మారుతి. అందుకే ఈ కథలో హారర్ తో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. 


ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడట. అందులో ఒకటి ఓల్డ్ గెటప్ కాగా.. మరొకటి యంగ్ రోల్ అని తెలుస్తోంది. తాతమనవళ్లుగా ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తారట. రెండు డిఫరెంట్ టైమ్ పీరియడ్స్ లో కథ నడుస్తుందట. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు మాళవిక మోహనన్ కాగా.. మరొకరు నిధి అగర్వాల్. మూడో హీరోయిన్ ఎవరనే విషయంపై క్లారిటీ లేదు.


కీలకపాత్రలో సంజయ్ దత్:
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్(Sanjay Dutt)ను తీసుకోవాలనుకుంటున్నారట. ఇప్పటికే దర్శకనిర్మాతలు సంజయ్ దత్ తో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సంజయ్ ను విలన్ రోల్ కోసం సంప్రదిస్తున్నారా..? లేక మరేదైనా పాత్రా..? అనే విషయంలో క్లారిటీ లేదు. 
 
ఈ మధ్యకాలంలో సంజయ్ దత్ కి విలన్ గా ఆఫర్స్ బాగా ఎక్కువయ్యాయి. 'కేజీఎఫ్2' సినిమాలో కూడా ఆయన విలన్ గా కనిపించారు. రీసెంట్ గా దళపతి విజయ్ సినిమాలో ఆయన్ను విలన్ గా తీసుకున్నట్లు సమాచారం. దానికి రూ.10 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారట. మరి ప్రభాస్ సినిమాలో నటించడానికి ఈ నటుడు ఎంత డిమాండ్ చేస్తారో చూడాలి..!


Also Read : వసూళ్ల వేటలో 'కాంతార' దూకుడు - మూడో రోజూ రఫ్ఫాడించిన రిషబ్ శెట్టి