కన్నడ సినిమా 'కాంతార' తెలుగు వెర్షన్ (Kantara Movie Telugu Version) కు ఏపీ, తెలంగాణలో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో వసూళ్ల వేటలో రిషబ్ శెట్టి (Rishab Shetty) సినిమా దూసుకు వెళుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని శనివారం విడుదల చేశారు. విడుదలైన రోజు ఎంత గ్రాస్ కలెక్ట్ చేసిందో... విడుదల అయిన మూడో రోజు, సోమవారం కూడా అంతే గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.


Kantara Telugu Version Collection : తెలుగు రాష్ట్రాల్లో 'కాంతార' చిత్రానికి తొలి రోజు ఐదు కోట్ల రూపాయల గ్రాస్ లభించింది. సినిమాకు హిట్ టాక్ లభించడం, తెలుగు రిలీజ్ కంటే ముందు ఇతర భాషల్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ... తెలుగు నాట విమర్శకులు కూడా సినిమాను మెచ్చుకోవడంతో ఆదివారం వసూళ్ల మీద ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. రెండో రోజు ఈ సినిమాకు ఆరున్నర కోట్ల రూపాయల గ్రాస్ లభించింది. దాంతో రెండు రోజుల్లో రూ. 11.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సాధారణంగా సోమవారం వసూళ్ల దూకుడు తగ్గుతుంది. కానీ, మండే 'కాంతార'కు ఐదు కోట్ల గ్రాస్ లభించింది. మూడు రోజుల్లో మొత్తం మీద 16.5 కోట్లు కలెక్ట్ చేసిందీ సినిమా. 


Kantara Hindi Box Office : తెలుగుతో పాటు హిందీలోనూ 'కాంతార'కు మంచి వసూళ్లు వస్తున్నాయి. ఉత్తరాదిలో సినిమా శుక్రవారమే విడుదల అయ్యింది. అక్కడ మొదటి రోజు రూ. 1.27 కోట్లు, శనివారం రూ. 2.75 కోట్లు, ఆదివారం రూ. 3.50 కోట్లు, సోమవారం రూ.1.75 కోట్లు కలెక్ట్ చేసినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. 



కన్నడలో సినిమాకు వచ్చిన వసూళ్ల కంటే ఇతర భాషల్లో వచ్చిన వసూళ్లు ఎక్కువ. కాంతార' నిజమైన పాన్ ఇండియా సక్సెస్ సాధించిందని చెప్పవచ్చు. 'కెజియఫ్' వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur) మరోసారి పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం అందుకున్నారు. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ విడుదల చేసింది. విడుదలకు ముందు ఒకసారి హైదరాబాద్ వచ్చిన రిషబ్ శెట్టి అండ్ టీమ్... తెలుగులో భారీ విజయం సాధించడంతో మరోసారి భాగ్య నగరానికి వస్తున్నారు. 


Also Read : ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫిక్షనల్ - మహేష్ బాబు రియల్



'కాంతార'లో కథానాయకుడిగా రిషబ్ శెట్టి అద్భుతమైన నటన కనబరచడమే కాదు... దర్శకుడిగా చక్కటి చిత్రాన్ని అందించారని సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలను ఆయన తెరకెక్కించిన తీరుకు, ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. 


Kantara Sequel Update : 'కాంతార' సాధించిన విజయంతో దీనికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ చేసే అంశాలను పరిశీలిస్తున్నారు. ఆ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని స్వయంగా రిషబ్ శెట్టి చెప్పారు. అయితే... మరో సినిమా స్టార్ట్ చేయడానికి ముందు రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని ఉందని, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలని ఉందని ఆయన పేర్కొన్నారు. అదీ సంగతి!