చలిని తట్టుకోలేక దుప్పట్లో ముసుగుతన్ని పడుకుంటున్నారా? మీ శరీరానికి చలిని తట్టుకునే శక్తిని ఇవ్వచ్చు కదా? ఎలా అనుకుంటున్నారా... ప్రత్యేకంగా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా. శరీరంలో వేడి పుట్టించే ఆహారాన్ని తింటే సరి. ఇలాంటి ఆహారం తినడం వల్ల శీతాకాలంలో వచ్చే కొన్ని రకాల రోగాలను కూడా దూరం పెట్టవచ్చు. దగ్గు, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు. రోగినిరోధక శక్తిని పెంచే ఆహారాలను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. చలి కాలం ఉన్నంత కాలం ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా మనం వీటిని తినాలి. 


1. బెల్లంతో చేసిన చిక్కీలు, బెల్లం వేసి వండే వంటకాలు, బెల్లం అట్లు ఇలాంటివి తింటే మంచిది. బెల్లం శరీరంలో వేడిని పుట్టిస్తుంది. చలి తక్కువ వేస్తుంది. 


2. తినే ఆహారంలో ఒక స్పూను నెయ్యి వేసి తినాలి. నెయ్యి కూడా శరీరానికి అవసరమైన ఉష్ణోగ్రతలను అందిస్తుంది. పప్పు అన్నంలో స్పూను నెయ్యి వేసుకుని తిని చూడండి ఆ రోజు మీకు చలి తక్కువగా వేస్తుంది. 


3. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వంటి చిరు ధాన్యాలతో రకరకాల వంటలు వండుకోవచ్చు, కాకపోతే అవి ఉడకడానికి కాస్త సమయం పడుతుంది. ఏదో రకంగా వాటిని తినడం అలవాటు చేసుకోవాలి. రోగనిరోధక శక్తి పెరిగి చలికాలపు వ్యాధులేమీ మీ దరి చేరవు. 


4. అల్లం చాలా మేలే చేస్తుంది. చలి వేస్తున్న సమయంలో వేడి వేడి అల్లం టీ తాగి చూడండి ఎంత ఉపశమనంగా అనిపిస్తుందో. శీతాకాలంలో అన్ని వంటల్లో అల్లాన్ని భాగం చేసుకోండి. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫమ్మేటరీ గుణాలు ఎక్కువ. 


5. పుల్లని పండ్లు కూడా తినాలి. నిమ్మకాయను ఆహారంలో పిండుకుని తినడం అలవాటు చేసుకోవాలి. బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్లు త్వరగా శరీరంపై దాడి చేయకుండా ఇవి అడ్డుకుంటాయి. 


6. నువ్వులు కూడా చలికాలంలో కచ్చితంగా తినాల్సినవి. ఇవి కూడా శరీరంలో ఉష్ణోగ్రతను పుట్టించి చలిని దూరం చేస్తుంది. 


7. చికెన్ సూప్స్, కార్న్ సూప్, టమాటో సూప్ వంటివి వేడి వేడిగా సాయంత్రం వేళ తాగుతూ ఉండాలి. ఇవి కూడా శరీర ఉష్ణోగ్రత పడిపోకుండా కాపాడతాయి. 


8. ఉలవలు, తామర గింజల (ఫూల్ మఖానా) వంటి వాటితో చేసి ఆహారాలు కూడా తరచూ తినాలి. ఇవి కూడా శీతాకాలంలో శరీరానికి ఎంతో శక్తినిస్తాయి. 


Also read: అప్పుడే పుట్టిన శిశువుల్లో పచ్చ కామెర్లు ఎందుకు కనిసిస్తాయి? వాటిని సీరియస్‌గా తీసుకోవాలా?
















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.