ప్రస్తుతం ఎవరిని కదిలించినా... డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాము. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము... ఈ మాటలే తరచూ వింటున్నాం. వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అన్ని జ్వరాలు డెంగ్యూనే అని చెప్పలేం. కానీ, డెంగ్యూ జ్వరంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం చేయకూడదు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఒకోసారి ప్రాణాలనే కోల్పోవల్సి ఉంటుంది. 


అసలు డెంగ్యూ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? డెంగ్యూ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


డెంగ్యూ లక్షణాలు ఇన్‌ఫెక్షన్ సోకిన తర్వాత నాలుగు నుంచి ఆరు రోజులకి బయటపడతాయి. సడెన్‌గా హై ఫీవర్ రావడం, తలనొప్పి, జాయింట్ పెయిన్స్, వాంతులు, దురదలు ఇవి సాధారణంగా వచ్చే లక్షణాలు. 



తీసుకోవాల్సిన జాగ్రత్తలు



* గిన్నెలపై ఎప్పుడూ మూతలు ఉండేలా చూసుకోవాలి. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చేసుకోవాలి. 
* నీళ్లు నిల్వ ఉంటే వాటర్ ట్యాంకులను తరచుగా శుభ్రం చేసుకోవాలి. 
* జ్వరాలు ఎక్కువగా దోమల వల్ల వస్తాయి. ఇంట్లోకి దోమలు రాకుండా దోమ తెరలు వాడాలి. చీకటి పడగానే తలుపులు, కిటికీలు మూసివేయాలి. 
చుట్టుపక్కలా నీటి గుంటలు, చెత్త లేకుండా జాగ్రత్త పడాలి.
* దోమలు రాకుండా ఉండేందుకు ఇంట్లో స్ప్రేలు వాడండి. 
* రాత్రి పడుకునే ముందు చేతులకు, కాళ్లకు నూనె రాసుకోండి. 
* పూలకుండీల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. 


ఎలాంటి ఆహారం తీసుకోవాలి


* వీలైనంత వరకు ఇంటి భోజనం చేసేందుకే ప్రయత్నించండి. 
* తప్పక బయట తినాల్సి వస్తే పరిశుభ్రమైన చోటును ఎంచుకోండి. 
* సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.
* నీటిని కాచి చల్లార్చి తాగాలి. నీటి ద్వారే ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. కాబట్టి పరిశుభ్రమైన నీటినే తాగాలి. 


డెంగ్యూ నివారణకు చిట్కాలు:


బొప్పాయి ఆకు రసం
 డెంగ్యూ జ్వరంతో బాధపడేవారు ఎక్కువ మంది బొప్పాయి ఆకుల రసం తాగుతున్నారు. సాధారణంగా డెంగ్యూ వల్ల మన శరీరంలోని ప్లేట్ లెట్‌ల సంఖ్య తగ్గి ప్రాణాపాయ స్థితికి చేరుకునే ప్రమాదం ఉంది. అటువంటి సమయంలో ఈ బొప్పాయి ఆకుల రసం తాగితే.. ప్లేట్‌లెట్ కౌంట్ సంఖ్య పెరిగి సాధారణ స్థాయికి చేరుకోవచ్చు. అందుకే చాలా మంది ఈ చిట్కాని అనుసరిస్తున్నారు.


తులసి ఆకులు
తులసి ఆకులు నమలడం వల్ల.. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు మనిషిలోని నీరసం దూరమవుతుంది. అలాగే కాస్త శక్తి వచ్చేలా  కూడా చేస్తుంది. రోజుకు నాలుగు నుండి అయిదు ఆకులు నమలడం వల్ల.. జ్వరం వల్ల నీరసించిన శరీరం కాస్త మెరుగవుతుంది.


డెంగ్యూ జ్వరంతో ఎందుకు మరణిస్తారు? 
డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు.. మనిషి శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా మనిషి శరీరంలో ఉండే ప్లేట్‌ లెట్ కౌంట్ క్రమంగా తగ్గుతుంది. ఒక ఆరోగ్యకరమైన మనిషి ఒంట్లో వీటి సంఖ్య 1.5 నుండి 4 లక్షల వరకు ఉంటుంది. అటువంటిది ఈ జ్వరం వచ్చినప్పుడు వాటి సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. వీటి సంఖ్య 20 వేలు లేదా అంతకన్నా తగ్గినప్పుడు మనిషి ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. ఒక్కోసారి వాటి క్షీణత మరింత ఎక్కువైతే మనిషి చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది.