ఆధునిక సమాజంలో మానసిక ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. వాటిల్లో కొన్ని సాధారణంగా ఉంటే, కొన్ని ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. ప్రమాదకరమైన వాటిలో ‘బై పోలార్ డిజార్డర్’ ఒకటి. దీన్ని మానిక్ డిప్రెసివ్ మూడ్ డిజార్డర్ అని అంటారు. దీనికి కచ్చితంగా వైద్య సహాయం అవసరం. తీవ్రమైన మానసిక కల్లోలంతో ఉన్మాదిగా మారే అవకాశం ఈ వ్యాధితో బాధపడే రోగుల్లో ఉంది. కాబట్టి ఈ వ్యాధి లక్షణాలు తెలుసుకోవడం అందరికీ అత్యవసరం.


దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే
బై పోలార్ 1 డిజార్డర్: దీనిలో డిప్రెషన్ వచ్చిపోతూ ఉంటుంది కనిపిస్తాయి. అధికంగా ఖర్చు చేస్తారు. అతిగా మాట్లాడతారు. శక్తి అమాంతం పెరిగిపోయినట్టు ప్రవర్తిస్తారు. నిద్ర తగ్గిపోతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఒక ఆలోచన నుండి మరో ఆలోచనకు సులువుగా మారిపోతుంటారు.


బై పోలార్ 2 డిజార్డర్: డిప్రెషన్ ఎక్కువ కాలం పాటూ కొనసాగుతుంది. మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. కాసేపు శక్తివంతంగా, ఉల్లాసంగా ఉంటారు. తర్వాత చాలా చిరాకు పడతారు. వారిని అంచనా వేయడం చాలా కష్టం. ఈ డిజార్డర్‌తో బాధపడే వాళ్ళు సాధారణ మనుషులకు చాలా భిన్నంగా ఉంటారు. కాబట్టి వారిని ఒక అరగంట పాటు గమనిస్తే అర్థమవుతుంది.


సైక్లో థైమిక్ డిజార్డర్: దీన్నే సైక్లో థైమియా అని కూడా అంటారు. దీనిలో డిప్రెషన్ రెండేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంది. కాకపోతే వారు డిప్రెషన్ లో ఉన్నట్టు కనపడటం కొంచెం కష్టం. తేలికపాటి లక్షణాలే కనిపిస్తాయి. కానీ ఇది రోజులు గడుస్తున్న కొద్ది డేంజరస్ గా మారుతుంది. 


ఉన్మాద లక్షణాలు
బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతున్న రోగులు కొన్నిసార్లు ఉన్మాదంగా, ఉద్రేకంగా ప్రవర్తిస్తారు. ఏదీ నిర్ణయించుకోలేరు. ఆకలి ఉండదు. ఎప్పుడూ పరధ్యానంగా ఉంటారు. అధిక సెక్స్ డ్రైవ్ కలిగి ఉంటారు. ప్రవర్తన చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది. వారు ఏం చేస్తున్నారో వారికి అర్థం కాదు. అన్ని విషయాలు మర్చిపోతూ ఉంటారు. నిత్యం విచారంగా ఉండడం, నెమ్మదిగా మాట్లాడడం చేస్తుంటారు. డిప్రెషన్ అధికంగా ఉన్నవారిలోఅసలు సెక్స్ మీద ఆలోచనలు రావు. తమకు ఏది ఇష్టం అనేది కూడా వారికి గుర్తు ఉండదు. శక్తి హీనంగా కనిపిస్తారు. ఒక్కోసారి అతి శక్తివంతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకసారి ఉత్సాహంగా, ఒకసారి విపరీతమైన నిస్పృహతో ఉంటారు. ఈ బై పోలార్ డిజార్డర్ అధికంగా మద్యపానం చేసే వారిలో, మాదకద్రవ్యాలు వాడే వారిలో, స్ట్రోక్ వంటి పరిస్థితులను నుంచి బయటికి వచ్చిన వారిలో కనిపిస్తూ ఉంటుంది.


చికిత్స ఎలా ఉంటుంది
బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతున్న వ్యక్తి లక్షణాల ఆధారంగా మందులను సూచిస్తారు వైద్యులు. కొందరు అత్యంత ఉత్సాహంగా ఉంటే, కొందరు తీవ్ర నిస్పృహలో ఉంటారు కాబట్టి అందరికీ ఒకేలాంటి మందులు సూచించడం కుదరదు. రోగులు అనుభవిస్తున్న లక్షణాలను కనిపెట్టాకే వైద్యులు చికిత్స ఆరంభిస్తారు.


మూడ్ స్టెబిలైజర్లు, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, యాంటీ డిప్రెసెంట్లు వంటి మందులు, థెరపీల ద్వారా ఈ మానసిక వ్యాధికి చికిత్స చేస్తారు. వారికి నిద్ర పట్టడానికి మందులను సూచిస్తారు. ఇవి వేసుకోవడం వల్ల వారు ప్రశాంతంగా నిద్రపోతారు. ఇక కాగ్నేటివ్ బిహేవియర్ తెరిపి ద్వారా ఒత్తిడి, ఇతర ప్రతికూల పరిస్థితులను తగ్గించడానికి ప్రయత్నిస్తారు. ధ్యానం, వ్యాయామం చేయమని చెబుతారు. సమతుల్య ఆహారం తినమని సూచిస్తారు. వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా మద్యం, మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండమని సూచిస్తారు. 


Also read: రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే నరాలు దెబ్బతినే ప్రమాదం - డయాబెటిక్ రోగులు జాగ్రత్తగా ఉండాల్సిందే











































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.