దేశంలో కరోనా నాలుగో వేవ్ ప్రారంభమైందనేదానికి రోజుకో కారణం బయటపడుతోంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా ఆర్ వాల్యూ 2 దాటింది. ఈ వారం ఆ వాల్యూ 2.1గా ఉన్నట్లు మద్రాస్ ఐఐటీ పరిశీలనలో వెల్లడయింది. ఆర్ వాల్యూ అంటే ఓ కరోనా రోగి ద్వారా ఇతరులకు సోకుతున్న రేటు.  ఆర్ వాల్యూ రెండు దాటడం అంటే వైర‌స్ సోకిన ఒక వ్య‌క్తి మ‌రో ఇద్ద‌రికి వైరస్ సోకుతోందన్నమాట. ఆర్ వాల్యూ 1 సంఖ్య లోపు ఉంటే క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులో ఉన్న‌ట్లు లెక్క‌. కానీ ఢిల్లీలో రెండు దాటిపోవడంతో ప్రమాద ఘంటికలు ప్రారంభమైనట్లేనని భావిస్తున్నారు.






కరోనా వ్యాప్తిని సూచించే ఆర్‌ వాల్యూ 1 దాటినట్టు చెన్నైలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ అంచనా వేసింది. ఇది 1 దాటడం మూడు నెలల తర్వాత ఇదే తొలిసారి. ఢిల్లీ, హరియాణా, యూపీల్లో ఆర్‌ వాల్యూ కొద్ది వారాలుగా క్రమంగా పెరుగుతోంది. ఈ వాల్యూ ఒకటి కంటే తక్కువ ఉంటే కరోనా అదుపులో ఉన్నట్టు. 1 కంటే ఎక్కువ ఉంటే ప్రమాదకరమే. ‘‘ఏప్రిల్‌ 5–11 మధ్య 0.93 ఉన్న ఆర్‌ వాల్యూ 12–18 నాటికి 1.07కి చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మెట్రోల్ల 1 కంటే ఎక్కువగా, ఢిల్లీ, యూపీల్లో ఏకంగా 2గా ఉంది. 


ఢిల్లీలో కేసుల్లో ఒకేసారి 26% పెరుగుదల కనిపించింది. 632 కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 4.42 శాతంగా ఉంది. దాంతో ఢిల్లీలో కరోనా నిబంధనలు కఠినతరం చేశారు. మాస్కులు పెట్టుకోకపోతే రూ.500 జరిమానా విధిస్తామని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది. ప్ర‌స్తుతం ఇండియా ఆర్ వాల్యూ 1.3గా ఉంది. అయితే ఇప్పుడే నాలుగ‌వ వేవ్ మొద‌లైంద‌ని చెప్ప‌డం తొంద‌ర‌పాటే అవుతుంద‌ని నిపుణులు అంటున్నారు. ముంబై, చెన్నై, కోల్‌క‌తా లాంటి న‌గ‌రాల్లో కేసులు త‌క్కువ‌గా ఉన్నాయి.  


దేశంలో నాలుగో వేవ్ రావొచ్చనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో కేసుల సంఖ్య.. ఆర్ వాల్యూ పెరుగుతూండటంతో  వివిద రాష్ట్రాలు అప్రమత్తయ్యాయి. కొత్త కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు.