Coronavirus Cases India : దేశంలో క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 2,14,242 మందికి పరీక్షలు నిర్వ‌హించ‌గా.. 7,830 మందికి వైరస్ సోకినట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ (ministry of health) బుధవారం వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్ 1న దేశంలో ఒకేరోజు 7,946 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మ‌ళ్లీ 223 రోజుల త‌ర్వాత ఆ స్థాయిలో కేసులు న‌మోద‌వ‌డం ఇదే తొలిసారి. 


మంగ‌ళ‌వారం ఐదువేలకు పైగా నమోదైన కొత్త కేసుల సంఖ్య.. ప్రస్తుతం అమాంతం పెరిగింది. ఏడునెలల అత్యధికానికి చేరింది. దాంతో రోజువారీ పాజిటివిటీ 3.65 శాతానికి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 40,215 కు పెరిగింది. గ‌డ‌చిన 24 గంట‌ల్లో 16 మంది మ‌ర‌ణించ‌గా మొత్తం కొవిడ్ మృతుల సంఖ్య‌ 5,31,016 కు పెరిగింది.


ఢిల్లీ, పంజాబ్, హిమాచల్‌ప్ర‌దేశ్ రాష్ట్రాలలో ఇద్ద‌రు చొప్పున‌, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానా ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కొక్కరు క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. కేర‌ళ‌లో ఐదు వైరస్ సంబంధిత మరణాలు న‌మోదయ్యాయి. మొత్తంగా 5,31,016 మంది ప్రాణాలు కోల్పోయారు.


మంగ‌ళ‌వారం 5,676 న‌మోద‌వ‌గా, బుధ‌వారం 7,830 కేసులు న‌మోదు కావ‌డంతో భారీ పెరుగుద‌ల క‌నిపించింది. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,47,76,002కి చేరుకుంది. 


గత ఏడాది సెప్టెంబర్ 1న దేశంలో ఒకేరోజు 7,946 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మ‌ళ్లీ సుమారు 7 నెల‌ల త‌ర్వాత ఆ స్థాయిలో కేసులు న‌మోద‌వ‌డం ఇదే తొలిసారి.


XBB1.16 వేరియంట్‌కు సంబంధించిన 1,774 కేసులు 22 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో గుర్తించారు. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) డేటా ప్రకారం, వైర‌స్‌ సోకిన వారిలో 230 మందికి పైగా Omicron వేరియంట్‌కు చెందిన సబ్-వేరియంట్ XBB1.16.1 బారిన పడ్డారు.


ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, ఇప్పుడు మొత్తం యాక్టివ్ కేసులు 0.09 శాతం ఉన్నాయి, అయితే జాతీయ COVID-19 రికవరీ రేటు 98.72 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకూ 220.66 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.


కాగా.. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ తెలిపింది. వైరస్ వివిధ రకాలుగా మ్యుటేషన్లు చెంది బలహీనపడుతోందని పేర్కొంది. అందుకే పాజిటివ్‌గా తేలిన వారిలో స్వల్ప లక్షణాలే కన్పిస్తున్నాయని, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం కూడా రావడం లేదని వెల్ల‌డించింది. అయితే ప్రజలు కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. బూస్టర్ డోసు తీసుకోనివారు ఎవరైనా ఉంటే వెంటనే తీసుకోవాలని సూచించారు.


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖకు చెందిన అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించారు. గ్రామ స్థాయిలో పరీక్షలు నిర్వహించి, అక్కడే మందులు ఇవ్వటంతో పాటుగా నివారణ చర్యలు మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సోమ‌వారం సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌19 తాజా పరిస్థితిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ పరిస్థితులపై అధికారులు జగన్ కు నివేదికను సమర్పించారు. గ్రామ స్ధాయిలోనే పరీక్షలు నిర్వహించి, అక్కడే మందులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతున్న వారికి కొవిడ్‌19 సోకితే వారిని వెంటనే హాస్పిటల్‌కి తరలించేలా చర్యలు చేప‌ట్టాలని అధికారులకు సూచించారు.