ఛాతీ మంటతో ఇబ్బంది పడుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువే. కానీ చాలామంది దీన్ని పట్టించుకోరు. ఇలా పట్టించుకోకపోవడం వల్ల ఆ మంట ఎక్కువైపోతుంది. కొన్నాళ్లకు అది గుండె సంబంధితమైనదేమో అని అనుమానం వచ్చే వరకు నొప్పి పెరిగిపోతుంది. అందుకే ఛాతీ మంట ప్రాథమిక స్థాయిలో ఉండగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం అవసరం. ప్రాథమిక స్థాయిలో ఛాతీ మంట కోసం వైద్యులను కలవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఆ మంట దానికదే పోతుంది. ఈ కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి. ఛాతీ మంట వచ్చినప్పుడు కిందకు వంగినా, పడుకున్నా ఈ మంట, బాధా ఎక్కువ అవుతాయి. కాబట్టి మంట ఎక్కువ కావడానికి ఏ అంశాలు దోహదం చేస్తున్నాయో తెలుసుకుని వాటికి దూరంగా ఉండడం అవసరం. ఛాతీ మంటను తేలిగ్గా తీసుకోకూడదు. ఇది ముదిరితే మరింత పెద్ద సమస్యగా మారుతుంది. 


ఛాతీ మంట ఎందుకు వస్తుంది?
మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు అది ఆహార నాళం ద్వారా జీర్ణాశయంలోకి వెళ్తుంది. అయితే జీర్ణాశయానికి ఆహార వాహికకు మధ్య ఒక కండరం ఉంటుంది. ఇది తలుపులా తెరుచుకుంటూ, మూసుకుంటూ ఉంటుంది. ఆహారం తిన్నప్పుడు ఇది తెరుచుకుని లోపలికి వెళ్లేలా చేస్తుంది. ఆహారం వెళ్ళాక మళ్ళీ మూసుకుపోతుంది. దీనివల్ల ఆహారం తిరిగి ఆహారవాహికలోకి రాదు. జీర్ణాశయంలోనే ఉంటుంది. ఇలా ఉంటేనే ఆహారం జీర్ణం అవుతుంది. ఒక్కోసారి ఈ కండరం పూర్తిగా మూసుకోకుండా, పాక్షికంగా మూసుకుని ఉంటుంది. అలాంటి సమయంలో జీర్ణాశయంలో ఆహారాన్ని జీర్ణం చేసే ఆమ్లాలు పైకి ఎగదన్నుకు వస్తాయి. దీన్నే యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు. ఇది ఆహార వాహిక గోడలను తాకి నొప్పిని, మంటను కలిగిస్తుంది. దీనివల్లే ఛాతిమంట వస్తుంది.


ఇలా చేయండి
ఛాతిమంట తరచూ వచ్చేవారు కొన్ని రకాల చిట్కాల ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు. రోజూ పరగడుపున రెండు చెంచాల పెరుగు తినండి. ఇది మంట రాకుండా ఉండడానికి, వచ్చినా తగ్గటానికి సహాయపడుతుంది. అలాగే మనం తినే ఆహారాల్లో కొన్ని... ఆ మంటను, నొప్పిని ఎక్కువ చేస్తాయి. అలాంటి వాటిల్లో మొదటి చెప్పుకోవాల్సినవి కారం, మసాలాలు దట్టించిన ఆహారం. ఛాతీ మంట వేధిస్తున్నప్పుడు వీటికి దూరంగా ఉండండి. అలాగే నూనెలో వేయించిన వేపుళ్ళు తగ్గించాలి. వేగంగా నమిలి మింగేయకూడదు. నెమ్మదిగా నమిలి తినాలి. అలాగే రోజూ ఒక సమయానికే భోజనం చేయడం కూడా చాలా అవసరం. భోజన సమయాల్లో తేడాలు కూడా ఛాతీ మంటను ప్రేరేపిస్తాయి. కాఫీ టీలు కూడా తగ్గించాలి. వీటిలో ఉండే కెఫీన్ ఛాతీ మంటను అధికం చేస్తుంది. అలాగే కూల్ డ్రింకులు, మద్యం తాగడం వల్ల మంట పెరిగిపోతుంది. టమోటోతో చేసిన ఆహారాలు తగ్గిస్తే మంచిది. టమోటా కూడా ఆసిడ్ రిఫ్లెక్స్ ను పెంచుతుంది. ఇవన్నీ పాటిస్తే ఎలాంటి చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేకుండానే ఛాతీ మంట తగ్గుముఖం పడుతుంది.  మంట, నొప్పి అధికంగా అనిపిస్తే మాత్రం వైద్యులను సంప్రదించడం ఉత్తమం. 


Also read: క్యాన్సర్ పేషెంట్లకు శుభవార్త - త్వరలో టీకా వచ్చే అవకాశం




































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.