ఆ క్యాన్సర్‌కు టీకా వచ్చేస్తోంది..


అందరి కంటే ముందుగా కొవిడ్ వ్యాక్సిన్‌ తయారు చేసి విదేశాలకు అందజేసిన ఘనత భారత్‌ది. కేవలం ఏడాది కాలంలో అత్యంత సమర్థవంతమైన టీకాను అందుబాటులోకి తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మరోసారి అలాంటి రికార్డునే సొంతం చేసుకుంది. 
సర్వికల్ క్యాన్సర్‌ పని పట్టే టీకాను సొంతగా తయారు చేసుకుంది. మరో ఏడాది లోగా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. వ్యాక్సిన్‌ల తయారీలో ఎంతో అనుభవమున్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఈ టీకాను తయారు చేసింది. తక్కువ ధరకే ఈ టీకాను అందిస్తామని స్పష్టం చేసింది. భారత్‌లో మహిళలకు రొమ్ము క్యాన్సర్ తరవాత ఎక్కువగా సోకుతున్న వ్యాధి సర్వికల్ క్యాన్సర్. ఈ టీకాకి సెర్వావాక్ అని పేరు పెట్టారు. అన్ని వర్గాల వారూ ఈ టీకా తీసుకునేలా తక్కువ ధరనే నిర్ణయిస్తామని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్‌ అదర్ పూనావాలా వెల్లడించారు. వచ్చే ఏడాది అని
అనుకుంటున్నప్పటికీ...ఈ ఏడాది నవంబర్ నాటికే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌ నుంచే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయనీ చెబుతున్నారు.









 


అందుబాటు ధరలోనే..


రూ.5 వేల నుంచి రూ.8వేల మధ్య ఈ సెర్వావాక్ వ్యాక్సిన్ ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొవిడ్ టీకా తరహాలోనే ఈ వ్యాక్సిన్‌ను కూడా రెండు, మూడు డోసులుగా తీసుకోవాలి. ఈ డోసుల మధ్య గ్యాప్ కూడా ఉండాలి అంటోంది సీరమ్. అన్ని డోసులూ తీసుకోకపోతే సర్వికల్  క్యాన్సర్ నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని చెప్పలేమని సీరమ్ సంస్థ స్పష్టం చేస్తోంది. హ్యూమన్ పపిల్లోమావైరస్ HPVగా పిలుచుకునే ఈ టీకా...70% మేర సర్వికల్ క్యాన్సర్‌ను నయం చేస్తుందని వెల్లడించింది. ఐదేళ్లలో పదిలో ఒక మహిళకు సర్వికల్ HPVఇన్‌ఫెక్షన్ సోకిందని, 2019లో ప్రపంచ వ్యాప్తంగా 45 వేల మంది మహిళలు సర్వికల్ క్యాన్సర్‌తో మృతి చెందినట్టు WHO వెల్లడించింది.