Cancer with Meat: ప్రాసెస్ చేసిన మాంసం విషంతో సమానం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూరప్ వ్యాప్తంగా 1.5 లక్షల మందిపై నిర్వహించిన అధ్యయనంలో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ అధ్యయనం దాదాపు 10 దేశాల్లో 13 ఏళ్లపాటు సాగింది. ఈ అధ్యయనంలో ప్రాసెస్ చేసిన మాంసం గుండె జబ్బులు, క్యాన్సర్, అకాల మరణాలకు కారణమవుతుందని తేల్చింది. 


ప్రాసెస్ చేసిన మాంసంతో మరణ మృదంగం:


నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మాంసాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలు ఆరోగ్యానికి ప్రమాదం కల్పిస్తాయి. ప్రాసెస్ చేసిన మాంసం తింటే ధూమపానం కన్నా కూడా ఎక్కువ దుష్ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్ చేసిన మాంసం తినే వారికి 44 శాతం ఎక్కువ ప్రమాదమని ఈ అధ్యయనంలో తేలింది. ప్రయాణాలు ఎక్కువ చేసేవారు ప్రాసెస్ చేసిన మాంసాన్ని తింటారని ఈ సర్వేలో తేలింది. ఈ మాంసానికి బదులుగా తాజా మాంసంతో ఇంట్లో తయారు చేసిన బర్గర్ తినడం ఉత్తమం అని నిపుణులు పేర్కొంటున్నారు.


ప్రాసెస్ చేసిన మాంసం ఎందుకు ప్రమాదకరం:


అధిక ఉష్ణోగ్రత వద్ద మాంసాన్ని వండితే అందులో పాలీసైక్లిక్ హైడ్రోకార్బన్‌లు, హెటెరోసైక్లిక్ అమైన్‌లు ఉత్పత్తి అవుతాయి. ఈ రెండు రసాయనాలు మన శరీరంలో DNAలో మార్పులకు కారణమవుతాయి. దీనివల్ల క్యాన్సర్ కారకాలు ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రాసెస్ చేసిన మాంసంలో అతిపెద్ద ప్రమాదం సోడియం నైట్రేట్ వల్ల సంభవిస్తుంది. ఆహారాన్ని సురక్షితంగా ఉంచడానికి సోడియం నైట్రేట్ ఇందులో  కలుపుతారు. ఇవి శరీరంలోకి ప్రవేశించిన వెంటనే, క్యాన్సర్ కలిగించే రసాయన సమ్మేళనాలు, నైట్రోసమైన్‌లను ఏర్పరుస్తాయి. తద్వారా మన శరీరంలోని వివిధ భాగాల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 


గుండెకు చాలా రిస్క్:


ప్రాసెస్ చేసిన మాంసం తినని వారి కంటే ఎక్కువగా ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. మాంసాహారం, గుండె జబ్బుల మధ్య సంబంధం మారుతూ ఉంటుందని.. ప్రాసెస్ చేయని మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులతో పోల్చితే  ప్రాసెస్ చేసిన మాంసం వల్లనే గుండె జబ్బుల రిస్క్ పెరుగుతుందని భావిస్తున్నారు. గుండె జబ్బులకు దూరంగా ఉండాలంటే తాజా మాంసం తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం:


ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినే స్త్రీలు రొమ్ము క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఇది కాకుండా, గర్భస్రావం సమస్యను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది. రోజుకు 50 గ్రాముల ప్రాసెస్ చేసిన మాంసాన్ని తింటే, కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని18 శాతం పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


లైంగిక సమస్యలు వచ్చే అవకాశం:


ప్రాసెస్ చేసిన మాంసాన్ని అధికంగా తీసుకోవడం వల్ల పురుషులు లైంగిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రాసెస్ చేసిన మాంసం స్పెర్మ్ ఉత్పత్తిలో ఇబ్బందిని కలిగిస్తుంది.


Also Read : జామకాయలు తినడం లేదా? మీరు ఈ ప్రయోజనాలన్నీ మిస్ అవుతున్నట్లే!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.