కొవిషీల్డ్ సెంకడ్ డోసు తీసుకోవాల్సిన కనీస వ్యవధిపై కేరళ హోకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మొదటి డోసు తీసుకొని నాలుగు వారాల తర్వాత రెండో డోసు తీసుకోవాలనుకునే వారికి టీకా అందిచాలని కేంద్రాన్ని ఆదేశించింది. ప్రస్తుతం కొవిషీల్డ్ మొదటి డోసు తీసుకున్న 84 రోజుల తర్వాతే రెండో డోసు ఇస్తున్నారు.






తమ ఉద్యోగులకు 84 రోజుల లోపులో కొవిషీల్డ్ రెండో డోసు వ్యాక్సిన్ ఇచ్చేలా అనుమతులు ఇవ్వాలని కైటెక్స్ గార్మెట్స్ లిమిటెడ్ కంపెనీ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. కేంద్రానికి కీలక సూచనలు ఇచ్చింది.


కేంద్ర ఆరోగ్య శాఖ పాలసీ ప్రకారం.. ప్రజలు వ్యాక్సిన్ ను కావాలనుకుంటే త్వరగా తీసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు కేంద్రం కొవిన్ పోర్టల్ లో మార్పులు చేసేలా ఆదేశించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.


అయితే ఈ అభ్యర్థనపై కేంద్రం భిన్నంగా స్పందించింది. 84 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవడం వల్ల వ్యాక్సిన్ సామర్థ్యం పెరుగుతుందని వ్యాక్సిన్ నిర్వహణపై ఏర్పాటైన జాతీయ నిపుణుల గ్రూప్ వెల్లడించినట్లు కేంద్రం చెబుతోంది.


గడువు పెంపు..


కొవిషీల్డ్ టీకా తొలి డోసుకు, రెండో డోసుకు మధ్య గ్యాప్ ను ఆరు నుంచి ఎనిమిది వారాలకు పెంచాలంటూ కేంద్రం మార్చిలో ఆదేశాలిచ్చింది. అప్పటివరకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి, రెండో డోసుకు మధ్య నాలుగు వారాల గ్యాప్ ఉండేది. 


డోసుల మధ్య గ్యాప్ ను పెంచడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని టీకా నిపుణుల సలహాలు, సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం అప్పట్లో పేర్కొంది. అయితే ఇది కోవిషీల్డ్‌కు మాత్రమే వర్తిస్తుంది. కొవాగ్జిన్ కు మాత్రం 4 వారాల గ్యాప్ తోనే రెండో డోసు ఇస్తున్నారు.


Also Read: Covid-19 Symptoms: కరోనా సరికొత్త లక్షణాలు.. ఓసారి చెక్ చేసుకోండి ఉన్నాయేమో!