అందం, ఆరోగ్యం రెండూ కావాలా అయితే ఈ సూపర్ ఫుడ్స్ తింటే చాలు. సూపర్ ఫుడ్స్ అనే పదం ఊరికే వాడరు... ఒక ఆహారంలో క్యాలరీలు తక్కువగా ఉండి పోషకాలు అధికంగా ఉండాలి, వాటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండాలి, సూక్ష్మ పోషకాలను కలిగి ఉండాలి, రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే శక్తి ఉండాలి, అప్పుడే అవి సూపర్ ఫుడ్స్ అవుతాయి. ఇలాంటి సూపర్ ఫుడ్స్ లో మొదటి స్థానంలో ఉంటాయి. నట్స్ అంటే బాదంపప్పులు జీడిపప్పులు, ఎండు ద్రాక్షలు అంజీర్లు వంటివి సూపర్ ఫుడ్స్ జాబితాలోకే వస్తాయి. ఖాళీ పొట్టతో వీటిని తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. అయితే నేరుగా తినడం వల్ల ఉపయోగం ఉండదు. వాటిని రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే లేచిన వెంటనే తింటే ఆరోగ్యంతో పాటు అందం కూడా లభిస్తుంది.
బాదంపప్పులు
బాదంపప్పులో విటమిన్ ఈ, బి6 పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు కణాలలో ప్రోటీన్లను గ్రహించడంలో సహాయపడతాయి. అలాగే ఒమేగా3, ఒమేగా6 ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి మెదడు అభివృద్ధికి సహాయపడతాయి. కాబట్టి ఐదు నుంచి ఏడు గంటల పాటు బాదంపప్పును నానబెట్టి ఉదయాన్నే ఖాళీ పొట్టతో పైన తొక్క తీసి తినండి. ఇలా రోజు తినడం వల్ల నెల రోజుల్లోనే మీకు ఎంతో మార్పు కనిపిస్తుంది.
నల్ల ఎండుద్రాక్షలు
నల్ల ఎండు ద్రాక్షలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వాటిని ఉదయం పూట తినడం వల్ల పేగు కదలికలు చురుగ్గా ఉంటాయి. దీనివల్ల మలబద్ధకం సమస్య రాదు. నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్షలో పాలీఫెనాల్స్,ఫైటో న్యూట్రియన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మీ కళ్ళను వయసు సంబంధిత కంటి సమస్యల నుంచి రక్షిస్తాయి. కంటి శుక్లాలు రాకుండా కాపాడతాయి. అలాగే జుట్టు రాలడం నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగ నిరోధక శక్తిని చాలా పెంచుతుంది.
వాల్‌నట్స్
వాల్నట్స్ కాస్త ఖరీదైనవి. రోజుకి గుప్పెడు తినాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. కేవలం రోజుకు రెండు వాల్నట్లను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం తినండి. ఇవి మీ మెదడుకు శక్తిని అందిస్తాయి. ఏకాగ్రత సామర్థ్యాన్ని, పెంచి జ్ఞాపకశక్తిని పెరిగేందుకు సహాయపడతాయి. పిల్లల రోజువారీ ఆహారంలో వీటిని చేర్చడం చాలా అవసరం. వారి విద్యలో చాలా మెరుగుదల కనిపిస్తుంది.
ఫిగ్స్
వీటిని అత్తిపండ్లు అని కూడా పిలుస్తారు. నానబెట్టిన అత్తి పండ్లను తినడం వల్ల పేగు ఆరోగ్యం బాగుంటుంది. అత్తిపండ్లలో కరిగే ఫైబర్, కరగని ఫైబర్... రెండూ ఉంటాయి. కాబట్టి మలబద్ధకం నుండి ఉపశమనం కలుగుతుంది. ఇది మీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
పిస్తా పప్పులు
పిస్తా పప్పులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. వీటిని ఉదయాన్నే ఖాళీ పొట్టతో తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మంచిది.
Also read: మహిళల్లో పిల్లలు పుట్టకపోవడానికి ఎక్కువ శాతం కారణం ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.