ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అనేది అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తోంది. తాజాగా వైద్య రంగంలో కూడా AI టెక్నాలజీని సద్వినియోగం చేసుకొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాణాంతక వ్యాధుల నుంచి రోగులను కాపాడేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి శాస్త్రవేత్తలు క్యాన్సర్ వ్యాధిని సైతం గుర్తించేందుకు పరికరాలను కనుగొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ పరికరం ద్వారా పలు రకాల క్యాన్సర్లను గుర్తించవచ్చు. ఇందుకు జస్ట్ ఒక్క చుక్క రక్తం చాలు. కేవలం క్యాన్సర్ మాత్రమే కాదు.. గుండెపోటును సైతం ముందుగానే గుర్తించే  AI గ్యాడ్జెట్స్ సైతం  త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. ఈ గాడ్జెట్స్ ద్వారా గుండె పనితీరును ముందుగానే అంచనా వేయొచ్చు. ఎరిత్మియా వంటి జబ్బులను సైతం పసిగట్టి మనల్ని ముందుగానే హెచ్చరిస్తుంది.


క్యాన్సర్‌ను ఎలా గుర్తిస్తుందంటే?


ఈ పరికరాన్ని చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ముఖ్యంగా ప్యాంక్రియాటిక్, గ్యాస్టిక్, కోలోరెక్టల్ క్యాన్సర్లను.. డ్రై బ్లడ్ స్పాట్ టెస్ట్ ద్వారా గుర్తించేందుకు ఈ గ్యాడ్జెట్‌ను సృష్టించారు. ముఖ్యంగా సాంప్రదాయ డయాగ్నస్టిక్స్ పద్ధతులను అవలంబించకుండా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా పనిచేసే ఈ సాధనం.. వివిధ రకాల క్యాన్సర్లను గుర్తిస్తుంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి.. రక్తంలోని ప్రోటీన్లు, మైక్రో RNAs పరీక్షిస్తారు. దీని ద్వారా 82 నుంచి 100% వరకు ఖచ్చితమైన ఫలితాలు వచ్చినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


ప్రస్తుత విధానానికి.. AIకి తేడా ఏమిటీ?


ప్రస్తుతం పేగులు, ఉదర భాగంలో క్యాన్సర్లను.. కొలనోస్కోపీ టెస్ట్ ద్వారా గుర్తిస్తున్నారు. అదే సమయంలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్లను గుర్తించేందుకు గ్యాస్ట్రోస్కోపీ  విధానాన్ని అవలంబిస్తున్నారు. అయితే ఈ టెస్టులన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవి. అలాగే ఈ పరికరాలను ఉపయోగించేందుకు సుశిక్షితులైన మెడికల్ స్టాఫ్ అవసరం పడుతుంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాత్రం కేవలం ఒక చుక్క రక్తంతో క్యాన్సర్‌లను గుర్తిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ పరికరానికి సంబంధించి ఇంకా పూర్తిస్థాయిలో మార్కెట్లోకి ప్రవేశపెట్టలేదు మరిన్ని పరిశోధనలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. 


గుండె నొప్పిని ముందే చెప్పేసే టెక్నాలజీ


అనేక గుండె సంబంధిత సమస్యలను గుర్తించేందుకు అనువుగా.. ఏఐ గాడ్జెట్స్‌ను తయారు చేస్తున్నారు. కార్డియా ఎరిత్మియాతో పాటు, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్‌ వంటి సమస్యలను గుర్తించేలా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే చైనాలోని ఊహన్‌లో గల టాంగ్జీ ఆసుపత్రిలో WARN సిస్టం పేరిట ఈ వైద్య పరికరాన్ని సిద్ధం చేస్తున్నారు. దీని సాయంతో ఆసుపత్రిలో సుమారు 350 మందికి పరీక్షలు నిర్వహించారు. భవిష్యత్తులో స్మార్ట్ వాచ్ లో సైతం ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.



Also Read : కేకులు, కూల్ డ్రింక్స్, గమ్​లతో జాగ్రత్త.. వాటిలోని స్వీటెనర్ ప్రాణాలకే ప్రమాదమంటున్న కొత్త అధ్యయనం