చాలామంది చాతిలో, కడుపులో, గొంతులో మంటగా ఉంటోందని బాధపడుతుంటారు. అయితే, దానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. మున్ముందు మీరు జాగ్రత్త పడొచ్చు.
2019లో భారతదేశ GERD లెక్కల ప్రకారం.. అసిడిటీతో బాధపడుతున్న వారి సంఖ్య 7.6 నుంచి 30 శాతానికి పెరిగింది. దీన్ని బట్టి దేశంలో ఆహారం, లైఫ్ స్టైల్ పట్ల ప్రజలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చెప్పవచ్చు. అసిడిటీ పెద్ద సమస్య కాకపోయినా చాతిలో మంట వచ్చినప్పుడు అది చాలా బాధగా ఉంటుంది. తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఆ బాధ మీకు రాకూడదంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి.
టీ, కాఫీ లను అధికంగా తాగటం: చాలా మంది భోజనం కూడా చేయకుండా టీ, కాఫీలను తాగేస్తుంటారు. ఇలా తాగటం వల్ల అన్నవాహికను తాత్కాలికంగా సడలించి అసిడిటీ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాకుండా కార్బోనేటేడ్ పానీయాలను తాగినా అసిడిటీ వచ్చే అవకాశం ఉంది.
సమయానికి భోజనం చేయకపోవడం: భోజనం కోసం ప్రత్యేకంగా ఒక టైమ్ పాటించాలి. సరైన సమయంలో భోజనం చేయకపోవడం వల్ల అసిడిటీ వస్తుంది. ఎందుకంటే భోజనం వేళకు ఆహారాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మీ ఉదరం నుంచి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. క్రమం తప్పి భోజనం చేయడం వల్ల కడుపులో ఆమ్లం ఏర్పడి, అది అసిడిటీతో పాటు వికారానికి దారితీస్తుంది.
అధిక కొవ్వు కలిగిన ఆహారాలు తినడం: కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల కూడా చాతిలో మంట పుడుతుంది. అది అన్నవాహికను ఇబ్బంది పెడుతుంది. కొవ్వు కలిగిన ఆహారాల్లో పిత్త లవణాలు (పైత్యరసంలో ఉండే లవణ పదార్థాలు - Bile Salts) ఉంటాయి. అయితే, ఇవి మీ కడుపులో కూడా ఉంటాయి. అలాగే మీ రక్తప్రవాహంలో ఉండే కోలిసిస్టోకినిన్ (CCK) హార్మోన్లు కూడా ఉంటాయి. కొవ్వు ఆహారాల వల్ల వాటి స్థాయిలు పెరిగి అన్నవాహికకు దిగువ భాగంలో ఉండే కండరం(LES)లో యాసిడ్ ప్రతిచర్యకు గురవ్వుతాయి. దానివల్ల అసిడిటీ మరింత ఎక్కువ అవుతుంది.
తిన్న వెంటనే పడుకోవటం: పడుకునే ముందు భోజనం చేయడం అసిడిటీని మరింత తీవ్రం చేసే ప్రమాదం ఉంది. తిన్న వెంటనే పడుకోవడం వల్ల తిన్న ఆహారం జీర్ణం అవ్వడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. భోజనం చేసిన తర్వాత కనీసం 3 గంటల తర్వాతే నిద్రపోవాలి. ఇలా చేస్తే తిన్న ఆహారం జీర్ణమవడంతో పాటు అసిడిటీ దరిచేరదు.
తగినంత నిద్ర లేకపోవడం: రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోయినా అసిడిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల LESను ఇబ్బంది పెట్టే ఆమ్లాన్ని పొట్ట ఉత్పత్తి చేసి అసిడిటీకి కారణమవుతుంది.
పొగ తాగడం: స్మోకింగ్ వల్ల కూడా ‘గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్’ వచ్చే అవకాశం ఉంది. ఇది ఆకలిని తగ్గించి.. అసిడిటీ పెంచేందుకు కారణమవుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: చక్కెరతో జర భద్రం - ఈ భయానక వ్యాధి ప్రాణాలు తీయొచ్చు, ఈ లక్షణాలుంటే జాగ్రత్త!