లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా శంకర్ (Director Shankar) దర్శకత్వం వహించిన 'భారతీయుడు' (తమిళంలో 'ఇండియన్ 2')కు తెలుగులోనూ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ ఆ సినిమా ఎంతో మందికి ఫేవరెట్. అందుకనే 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ అంటే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే... 'ఇండియన్ 2' ఆశించిన రీతిలో ఆడలేదు. థియేటర్లలోనూ, డిజిటల్ వేదికలోనూ ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొంది.‌ దాంతో 'ఇండియన్ 3' విడుదల మీద ఊహాగానాలు మొదలు అయ్యాయి.


డైరెక్టుగా ఓటీటీలోకి 'ఇండియన్ 3'
Indian 3 OTT Release: 'భారతీయుడు' సినిమాకు సీక్వెల్ 'ఇండియన్ 2' సినిమాలో కమల్ హాసన్ ఒక్కరే హీరో కాదు... ఆయనతో పాటు సిద్ధార్థ్ కీలక పాత్ర చేశారు. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చినప్పటికీ... ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో 'ఇండియన్ 3' చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయకుండా డైరెక్టుగా ఓటీటీ రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సన్నాహాలు చేస్తోందని‌ అటు తమిళ సినీ వర్గాల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ప్రచారం మొదలైంది. అయితే అసలు విషయం వేరే ఉంది. 


థియేటర్లలోనే 'ఇండియన్ 3' రిలీజ్!
'ఇండియన్ 3' ఓటీటీ రిలీజ్ ప్రచారంలో వాస్తవం ఎంత? ఆ సినిమా ఎప్పుడు ప్రేక్షకులు ముందుకు వస్తుంది? అని లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులకు 'ఏబీపీ దేశం' ఫోన్ చేయగా... ''మా 'ఇండియన్ 3' సినిమాను థియేటర్లలో విడుదల చేస్తాం. మాకు ఓటీటీలో విడుదల చేసే ఆలోచన లేదు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో కొంచెం కూడా నిజం లేదు'' అని తెలిపారు. సో... కమల్ - శంకర్ అభిమానులు హ్యాపీగా ఉండొచ్చు. 'ఇండియన్ 3' సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఓటీటీ రిలీజ్ వార్తలను నమ్మాల్సిన అవసరం లేదు.


Also Readఆడపిల్లలు అంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?



'ఇండియన్ 3' సినిమాలో కమల్ హాసన్ సరసన తెలుగు తెర చందమామ, క్వీన్ ఆఫ్ యాక్షన్ కాజల్ అగర్వాల్ నటించారు. 'ఇండియన్ 2' చివర్లో గ్లింప్స్ ఇచ్చారు తప్ప ఆవిడ క్యారెక్టర్ కొంచెం కూడా చూపించలేదు. తొలుత ఒక్క సినిమా కింద విడుదల చేయాలని అనుకున్నప్పుడు... కాజల్ సన్నివేశాలు 'ఇండియన్ 2'లో ఉన్నాయి. ఆ తర్వాత రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించినప్పుడు 'ఇండియన్ 2'లో కాజల్ పాత్రకు కత్తెర వేశారు. మూడో పార్టులో ఆవిడ సందడి చేయనున్నారు. ఈ సినిమాలో సిద్ధార్థ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. 'ఇండియన్ 3'లో కూడా ఆవిడ కనిపించానన్నారు. రాబోయే సినిమాలో ఎస్.జె. సూర్య విలనిజం హైలైట్ అవుతుందని సమాచారం.


'ఇండియన్ 3' కంటే ముందు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన 'గేమ్ ఛేంజర్' థియేటర్లలోకి రానుంది. ఆ సినిమాను క్రిస్మస్ సీజన్ సందర్భంగా డిసెంబర్ మూడో వారంలో విడుదల చేయనున్నారు. 


Also Read: నాగ చైతన్య, అక్కినేని నాగార్జునను అవమానించి సమంతకు సారీ చెప్పడం ఏమిటి? - లాజిక్ బయటకు తీసిన వర్మ