Fake Edited Photo Of Aimim Leader Owaisi Holding Lord Ram Photo Gone Viral: ఎంఐఎం అధినేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ రాముని చిత్రపటం పట్టుకుని ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై శోధించిన 'Logically Facts' ఇది ఫేక్ అని స్పష్టత ఇచ్చింది. ఆయన అంబేడ్కర్ చిత్రం పట్టుకుని ఉన్న ఫోటోను ఎడిట్ చేసినట్లు నిర్ధారించింది.


క్లెయిమ్ ఏంటంటే.?


ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఎంఐఎం అధినేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ రాముని చిత్రపటం పట్టుకుని ఉన్నట్టున్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. ఈ వైరల్ ఫొటోలో, ఒవైసీ ఇతరుల మధ్య రాముని చిత్రపటం పట్టుకుని ఉన్నట్టు ఉంది. ఎన్నికల్లో ఓటమి భయంతో ఒవైసీ కూడా రామ భక్తునిగా చెప్పుకుంటున్నారనే శీర్షికను ఈ ఫొటోకి పెట్టారు. ఒవైసీ హైదరాబాద్ నుంచి లోక్ సభ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎన్నికలు మే 13న జరిగాయి. ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇదే ఫోటోను ఫేస్ బుక్‌లోనూ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.



అసలు వాస్తవం ఏంటంటే?


అయితే, ఒవైసీ రాముని ఫోటో పట్టుకుని ఉన్నట్లు షేర్ చేస్తున్న ఇమేజ్ ఫేక్ అని 'Logically Facts' స్ఫష్టం చేసింది. ఇది ఎడిట్ చేసిన ఫోటో అని నిర్ధారించింది. ఈ ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతికితే, ఒవైసీ అధికారిక ఫేస్‌బుక్‌లో ఏప్రిల్ 7, 2018 నాడు షేర్ చేసిన ఫొటో అని తెలిపింది. ఆ ఫోటోలో ఒవైసీ బీఆర్ అంబేద్కర్ చిత్రపటం పట్టుకుని ఉన్నారు. 'మోచీ కాలనీ నుంచి దళితులు ఎంఐఎం అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీని పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో కలిసి, తమ ప్రాంతాన్ని (బహదూర్ పుర నియోజకవర్గంలో రాంనస్ పుర) అభివృద్ధి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు' అని ఈ పోస్ట్ శీర్షికగా పెట్టినట్లు గుర్తించింది.


ఈ ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే, ఒవైసీ అధికారిక ఫేస్బుక్ లో ఏప్రిల్ 7, 2018 నాడు షేర్ చేసిన ఫొటో ఒకటి మాకు లభించింది. ఈ పోస్ట్ లో ఉన్న ఫొటోలో  (ఆర్కైవ్ ఇక్కడ)ఒవైసీ సామాజిక సంస్కర్త, భారత దేశ మొదటి న్యాయ శాఖ మంత్రి బి. ఆర్. అంబేద్కర్ చిత్రపటం పట్టుకుని ఉన్నారు.


అలాగే, ఈ వైరల్ ఫొటోని జాగ్రత్తగా గమనిస్తే, రాముని చిత్రపటం కుడి వైపు మూల దెబ్బతిన్నట్టు ఉంది. అలాగే ఈ మూలని పట్టుకుని ఉన్న చేయి కూడా సరిగ్గా కనపడటం లేదు. అలాగే వైరల్ ఇమేజ్‌లో చిత్రం మూలలు సరిగ్గా లేవు. ఇవన్నీ కూడా ఇది ఎడిటెడ్ ఫొటో అని సూచిస్తున్నాయి. ఇదే జనం మధ్య, ఇదే తారీఖున రాముని చిత్రపటం పట్టుకుని ఉన్న ఒవైసీ ఫొటో ఏదీ లేదని 'Logically Facts' స్పష్టం చేసింది. మరోవైపు, ఒవైసీ హిందూ ప్రార్థన చేస్తున్నారని, గుడికి వెళ్లారని ఒవైసీకి సంబంధించిన తప్పుడు క్లెయిమ్స్‌ని 'Logically Facts' గతంలోనూ డీబంక్ చేసింది.


తీర్పు


ఎడిట్ చేసిన ఫొటో షేర్ చేసి, ఒవైసీ రాముని చిత్రపటం పట్టుకుని ఉన్నారని కొందరు క్లైమ్ చేసినట్లు 'Logically Facts' నిర్ధారించింది.  ఒరిజినల్ ఫోటోలో ఒవైసీ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని పట్టుకున్నారని.. షేర్ అవుతున్న ఫోటో ఫేక్ అని స్పష్టం చేసింది. 


This story was originally published by Logically Facts as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction para, this story has not been edited by ABP Desam staff.