Times Now Exit Polls Edited Fake Clip Gone Viral: ఏపీ ఎన్నికల్లో టీడీపీ గెలవబోతుందని టైమ్స్ నౌ విడుదల చేసినట్లుగా ఓ ఫేక్ ఎగ్జిట్ పోల్స్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై 'Logically Facts' స్పష్టత ఇచ్చింది. ఇది ఫేక్ అని.. 2021 ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ కు సంబంధించినది అని తేల్చింది. ఎన్నికల సంఘం నియమాల ప్రకారం, 2024 లోక్ సభ కానీ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి కానీ, ఏ విధమైన ఎగ్జిట్ పోల్స్ విడుదల అవ్వలేదని స్పష్టం చేసింది.


క్లెయిమ్ ఏమిటి?


టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ పేరుతో ఒక స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఆ స్క్రీన్ షాట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించనుంది.. మే 13న ఏపీలో 25 పార్లమెంటరీ మరియు 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టుకు శీర్షికగా 'టైమ్స్ నౌ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు' అని పెట్టారు. ఈ పోస్ట్ కింద కొంత మంది యూజర్ల, ‘ఇది సాక్షియో లేదా టీవి 9యో కాదు’ అని పేర్కొన్నారు.  కానీ వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ కల్పితమైనది. ఒరిజినల్ ఫోటో 2021 ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ కి చెందినది. ఆ స్క్రీన్ షాట్ ని ఎడిట్ చేసి ఈ వైరల్ ఫొటో చేశారు.


వాస్తవం ఏమిటంటే.?


ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలకు సంబందించి టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ ఏమైనా విడుదల చేసిందా అని సామాజిక మాధ్యమాలు, అధికారిక వెబ్ సైట్‌లో శోధించినట్లు 'Logically Facts' తెలిపింది. అయితే, దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. ఇమేజ్ సెర్చ్ చేయగా, 2021లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్  ఇదే టెంప్లెట్‌లో విడుదల చేసిందని పేర్కొంది. నవంబర్ 16, 2021 నాటి టెంప్లేట్‌లో వాడిన ఒక స్లైడ్‌నే ఎడిట్ చేసి వైరల్ ఇమేజ్ ని తయారు చేసినట్లు నిర్ధారించింది. ఒరిజినల్ స్లైడ్‌కి శీర్షిక గా, 'TIMES NOW-Polstrat #UttarPradesh Opinion Poll SEAT SHARE on India Upfront,' అని పేరు పెట్టారు.


ఈ రెండు ఫోటోలను పోల్చి చూస్తే, వైరల్ ఫొటో ఎడిటెడ్ అని అర్ధమవుతున్నట్లు 'Logically Facts' తెలిపింది. ఇక్కడ రీసెర్చ్ పార్టనర్ గా ‘Polstrat’ ని తీసేసి ‘ETG’ అని రాసినట్లు పేర్కొంది. ఉత్తరప్రదేశ్ పేరు తీసేసి ఆంధ్రప్రదేశ్ చేర్చినట్లు గుర్తించింది. అసెంబ్లీ సంఖ్యలని కుడా ఆంధ్రప్రదేశ్‌కి అనుగుణంగా మార్చారు.


ఆంధ్రప్రదేశ్ కి 'టైమ్స్ నౌ' అంచనాలు


రీసెర్చ్ సంస్థ, పోలింగ్ ఏజెన్సీ అయిన ETG, టైమ్స్ నౌ ఛానల్ జతకట్టినప్పటికీ ఆ ఛానల్ కేవలం ఆంధ్ర లోక్ సభ ఎన్నికలకు సంబంధించి  శాతాన్ని మాత్రమే ఏప్రిల్ 4, 2024న ప్రచురించింది. ఇది ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధానికి ముందు విడుదల చేసినది. మే 7, 2024 ETG స్పష్టత ఇస్తూ, లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వారు ఎగ్జిట్ పోల్స్ ని జూన్ 1 తరువాతే విడుదల చేస్తామని పేర్కొంది. 'Logically Facts' ఇంతకు ముందు కుడా ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలకి సంబంధించి ఇలాంటి పోల్స్ క్లైమ్స్‌ని నిర్ధారించింది. 


ఈసీ ఎగ్జిట్ పోల్స్ నియమాలు


ఎన్నికల సంఘం ఏప్రిల్ 19, 2024 నాడు విడుదల చేసిన నియమాల ప్రకారం, జూన్ 1, 6:30 pm వరకు ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం ఉంది. ఆ నేపథ్యంలో ఏప్రిల్ 2 నాడు, విడుదల చేసిన ఒక ప్రెస్ నోట్‌లో కూడా ఎగ్జిట్ పోల్స్ నిషేధం గురించి, అది ప్రజా ప్రాతినిధ్యం చట్టం, 1951 చట్టం కింద సెక్షన్ 126 A ప్రకారం అమలులో ఉంటుందని ఉంది.


తీర్పు :  


వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ 2021లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి టైమ్స్ నౌ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్‌కి సంబందించినది. దానిని ఎడిట్ చేసి 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్‌కి చెందినది అని పేర్కొన్నారు. కాబట్టి ఈ క్లైమ్ ఫేక్ అని 'Logically Facts' నిర్ధారించింది.


This story was originally published by Logically Facts as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction para, this story has not been edited by ABP Desam staff.