Fact Check:


రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు..


ఇటీవల జరిగిన రాజస్థాన్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ని గద్దె దించి భారీ మెజార్టీ సాధించింది బీజేపీ. 200 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో 199 స్థానాలకు పోలింగ్ జరగ్గా బీజేపీ 115 సీట్లు సాధించింది. కాంగ్రెస్ 69 సీట్లకే పరిమితమైంది. అయితే..మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఝల్రపటన్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే...ఫలితాలకు ముందు డిసెంబర్ 1వ తేదీన వసుంధర రాజేకి సంబంధించిన ఓ 12 సెకన్ల వీడియో వైరల్ అయింది. బీజేపీ రెబల్ అభ్యర్థి రవీంద్ర భాటి ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఆయన కూడా విజయం సాధించారు. అయితే...ఆయనకు వసుంధర రాజే కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. దీనిపై కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని మచ్చిక చేసుకునేందుకు రాజే ముందుగానే వాళ్లకు కాల్ చేసి మాట్లాడారని విమర్శించారు. అయితే...ఈ వీడియో (వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇప్పటికి కాదని Logically Facts ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. 2021 ఆగస్టులోని వీడియోని ఇప్పుడు వైరల్ చేశారు. పైగా...అసలు ఆమె మాట్లాడింది భాటితో కాదు. అప్పుడు జావెలిన్ థ్రోవర్ నీరజ్ చోప్రా టోక్యో ఒలిపింక్స్‌లో గెలిచాడు. ఆయనకు కంగ్రాట్స్ చెప్పేందుకు కాల్ చేశారు వసుంధర రాజే. 



Image Credits: Facebook


ఫ్యాక్ట్ చెక్..


రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా తెలిసిందేంటంటే...రాజస్థాన్‌లోని ఓ మీడియా సంస్థ 2021 ఆగస్టులో ఈ వీడియో పోస్ట్ చేసింది. 38 సెకన్ల వీడియో ఇది. టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్ సాధించిన నీరజ్‌కి ప్రత్యేకంగా కాల్ చేసి  అభినందించారు. కానీ..ఈ ఒరిజినల్ ఫుటేజ్‌ని క్రాప్ చేసి ఇది ఇప్పటిదే అని ప్రచారం చేశారు. ఫుల్‌ వీడియో చూస్తే కానీ...ఆమె నీరజ్ చోప్రాతో మాట్లాడినట్టు తెలియదు. అంత తెలివిగా ఎడిట్‌ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాదు. 2021 ఆగస్టు 11వ తేదీన వసుంధర రాజే తన అఫీషియల్ ఇన్‌స్టా అకౌంట్‌లోనూ ఈ వీడియో పోస్ట్ చేశారు. నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించడం చాలా ఆనందంగా ఉందని, అతనితో మాట్లాడి అభినందనలు తెలిపానని హిందీలో పోస్ట్ చేశారు. ఇప్పుడు దానికి ఏ మాత్రం సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి ప్రస్తుత రాజకీయాలతో ముడిపెట్టారు. మొత్తానికి ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోకి రాజస్థాన్ ఎన్నికల ఫలితాలకు ఎలాంటి సంబంధమూ లేదు. 



 






Disclaimer: This report first appeared on logicallyfacts.com, and has been republished on ABP Desam as part of a special arrangement.


Also Read: Fact Check: చెన్నై ఎయిర్‌పోర్ట్ మునిగిపోయిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో నిజమేనా?