KV Vijayendra Prasad: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 1,2’ సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు దేశం మొత్తం చూసే విధంగా ఈ సినిమా సత్తా చాటింది. బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురింపించింది. ఒక్క తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ ‘బాహుబలి’ తన సత్తా చాటింది. ఈ సినిమాతో రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. మూవీలో చేసిన నటీనటులకు పాన్ ఇండియా గుర్తింపు వచ్చింది. టాలీవుడ్ ‘బాహుబలి’ కి ముందు తర్వాత అన్న విధంగా సినిమా పేరు తెచ్చిపెట్టింది. చాలా ఏళ్ల తర్వాత మూవీకు కథ అందిందించిన విజయేంద్రప్రసాద్ ‘బాహుబలి’ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


రాజమౌళి స్క్రిప్ట్ అంతా తానే రాసుకుంటాడు: విజయేంద్రప్రసాద్


రాజమౌళి స్క్రిప్ట్ రైటింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఆయన గత సినిమాలు చూస్తే ఆ విషయం క్లియర్ గా తెలిసిపోతుంది. ‘బాహుబలి’ కి కూడా ఆ రేంజ్ స్క్రీన్ ప్లే అందించారు. అయితే రాజమౌళి స్క్రిప్ట్ అంతా తానే రెడీ చేసుకుంటారని చెప్పారు విజయేంద్రప్రసాద్. ఒకవేళ ఏమైనా మార్పులు ఉంటే అవి చిన్ని చిన్నవే ఉంటాయని అన్నారు. ఒకసారి స్క్రిప్ట్ రాశాక పెద్దగా మార్పులు చేయడని, ఒకవేళ చేసినా తనకు ఓసారి చెప్పి బెస్ట్ తీసుకుంటాడని అన్నారు.


మన పురాణాలే స్పూర్తి..


మనం కథలను ఎక్కడనుంచో తీసుకోవాల్సిన అవసరం ఉండదని, మన పురాణాల్లో నుంచే ఎన్నో కథలు ఉంటాయని అన్నారు విజయేంద్రప్రసాద్. ‘బాహుబలి’ లో కూడా ఆ ప్రభావం ఉంటుందని చెప్పారు. శివగామి(రమ్యకృష్ణ)  పాత్రకు రామాయణంలోని కైకేయి, కట్టప్ప పాత్రలో భీష్ముడు, కర్ణుడు ఛాయలు కనిపిస్తాయని, బిజ్జల దేవుడి పాత్రలో శకుని, మందర పాత్రలు కనిపిస్తాయని అన్నారు. 


ఇది పాసైతే మహాభారతం తీస్తానని అన్నాడు..


రాజమౌళికు యాక్షన్ సన్నివేశాలు తీయడం అంటే బాగా ఇష్టమని అన్నారు విజయేంద్రప్రసాద్. అందుకే కథలో కూడా ఎక్కువ యాక్షన్ సన్నివేశాలు రాశామని అన్నారు. రాజమౌళి కావాలనే అలా స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నాడని చెప్పారు. ఓసారి సినిమా కథ మధ్యలో రాజమౌళి ఓ మాట అన్నాడని గుర్తుచేసుకున్నారాయన. ఈ సినిమా తనకు మహాభారతం తీయడానికి ఒక టెస్ట్ లాంటిదని, ఎప్పటికైనా మహాభారతం తీయాలనే కోరిక ఉందని రాజమౌళి చెప్పాడని చెప్పారు. ఈ మూవీ సక్సెస్ అయితే మహాభారతం తీస్తానని చెప్పాడని అన్నారు విజయేంద్రప్రసాద్. భగవంతుని దయతో అది కూడా జరగచ్చు అని హర్షం వ్యక్తం చేశారు.  


తమన్నాను వద్దన్నాను, కానీ తర్వాత అలా చూసి ఆశ్చర్యపోయాను..


ఇక సినిమాలోని పాత్రల ఎంపిక గురించి విజయేంద్రప్రసాద్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శివగామి పాత్ర కోసం రాజమౌళి ముందు శ్రీదేవిను అనుకున్నాడని అన్నారు. కానీ తానే ఈ పాత్రకు రమ్యకృష్ణనే కరెక్ట్ అని చెప్పానని అన్నారు. అలాగే తమన్నా పాత్ర విషయంలో తాను కూడా పొరబడ్డానని చెప్పారు. తమన్నా పాత్ర గురించి రాజమౌళి చెప్పినపుడు వద్దని చెప్పానని అన్నారు. కానీ తర్వాత ఓ రోజు సెట్ లో రిహాసెల్స్ చేస్తుంటే ఆమె  నటన, ఆహార్యం చూసి ఆశ్చర్యపోయానని చెప్పారాయన. అలాగే మూవీలో కీలక పాత్ర అయిన కట్టప్ప పాత్రకు కూడా సత్యరాజ్ లేదా మోహన్ లాల్ అనుకున్నామని తర్వాత ఆలోచించుకొని సత్యరాజ్ ని ఓకే చేశామంటూ అప్పటి విశేషాలను చెప్పుకొచ్చారాయన. 


Also Read రామ్ చరణ్‌ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే