International yoga day 2023: ఎన్నో శారీరక, మానసిక సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపే మంత్రం యోగా. ప్రతిరోజు ఉదయం యోగా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు. యోగా అనేది ప్రపంచానికి కొత్తగా పరిచయం అయిందని అనుకుంటారు చాలామంది, నిజానికి ఇది అతి పురాతన శాస్త్రాలలో ఒకటి. దాదాపు 5000 వేల ఏళ్ల క్రితం నుంచి యోగాని పాటించే వారు. మన దేశంలో దీని మూలాలు ఉత్తర భారత దేశంలో ఉన్నట్టు చెబుతారు. మొదటి రుగ్వేదంలో కూడా యోగా అనే పదాన్ని ప్రస్తావించారు. నాలుగు వేదాలలో అతి ప్రాచీనమైనది రుగ్వేదం. అంటే రుషులు ఉండే కాలంలోనే యోగా కూడా ఉండేదని అర్థమవుతుంది. హిందూ, బౌద్ధ మతాలలో యోగాకు చాలా ప్రాధాన్యత ఉంది.


ఆదియోగి వల్లే యోగా పుట్టిందని చెప్పుకుంటారు. ఆదియోగి అంటే ఎవరో కాదు... ఆ పరమశివుడే. పరమశివుడు ఒంటి కాలిపై నిలుచుని, రెండు చేతులు పైకెత్తి నమస్కరిస్తున్నట్టు ఎన్నో ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. ఆ భంగిమ యోగాలో ప్రధానమైనది. ఒకప్పుడు విష్ణువు... రాముడు, కృష్ణుడి రూపంలో భూమి మీద సంచరించినట్టే పరమశివుడు కూడా ఆదియోగి రూపంలో భూమిపై సంచరించాడని చెబుతారు. ఆ కాలంలోనే యోగ అనేది పుట్టుకొచ్చిందని వివరిస్తారు.


యోగా అనే పదం సంస్కృత పదం నుంచి పుట్టిందని చెబుతారు. ‘యుజ్’ అనే పదం నుంచే యోగా వచ్చిందని అంటారు. యుజ్ అంటే ‘ఒక దగ్గరికి చేర్చడం’ లేదా ‘ఏకం చేయడం’ అని అర్థం. యుజ్ అనే పదమే యోగాగా మారిందని అంటారు. దీన్ని రోజూ చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ముందే చెప్పుకున్నాం. అందుకే యోగా గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటేందుకే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏడాది జూన్ 21న నిర్వహిస్తారు. యోగా జన్మస్థలం భారతదేశమే. కాబట్టి ఇక్కడ నుంచే ప్రపంచ దేశాలకు యోగా పరిచయమైంది. రోజూ యోగా చేసే వ్యక్తిలో సామాజిక స్పృహతో పాటు వ్యక్తిగత స్పృహ కూడా పెరుగుతుంది. మనసు, శరీరం మధ్య అనుబంధం పెరిగి ఆ మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా జీవిస్తాడు.


పతంజలి మహర్షిని యోగా పితామహుడిగా చెప్పుకుంటారు. దానికి కారణం ఆయన యోగాకు సంబంధించిన ఎన్నో శ్లోకాలను రచించాడు. దాదాపు 196 శ్లోకాలు యోగా శాస్త్రంలో ఉంటాయి. వాటిలో ఎన్నో రకాల ఆసనాలు కూడా ఉంటాయి. ఒక్కో ఆసనం శరీరంలోని ఎన్నో భాగాలకు మేలు చేకూరుస్తుంది. ముంబైలో యోగా మ్యూజియం కూడా ఉంది. శ్రీ యోగేంద్ర మ్యూజియం ఆఫ్ క్లాసికల్ యోగా పేరుతో ఈ మ్యూజియం ఉంటుంది. దీన్ని సందర్శిస్తే యోగా చరిత్రను తెలుసుకోవచ్చు.




Also read: లావుగా ఉన్న ఉద్యోగులు సరిగా పనిచేయలేరు, కంపెనీ ఖర్చులు పెంచుతారంటున్న కొత్త అధ్యయనం
















































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.