Actor Karthi birthday: కార్తి శివ కుమార్. తమిళ స్టార్ హీరో సూర్య సోదరుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి, తక్కువ కాలంలోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పేరుకు తమిళ నటుడే అయినా, తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యాడు. పాత్ర ఏదైనా సహజ నటనతో ఇట్టే ఒదిగిపోతాడు. తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా ఈ స్టార్ హీరో 47వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


‘అయుత ఎఘుతు’ సినిమాతో నటుడిగా పరిచయం   


సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కార్తి సినీ ప్రయాణం.. అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలయ్యింది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతూనే హీరోగా ప్రయత్నం చేశాడు. ‘అయుత ఎఘుతు’ సినిమాలో ఓ చిన్నపాత్రలో నటించాడు. తెలుగులో ఈ సినిమా ‘యువ’ అనే పేరుతో విడుదల అయ్యింది. ఇక 2007లో విడుదలైన ‘పరుత్తి వీరన్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో ఆయన ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.


‘యుగానికొక్కడు‘ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం


కార్తి హీరోగా నటించిన ‘యుగానికొక్కడు’ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కించుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘ఆవారా’ సినిమా కార్తి కెరీర్ కు మరింత బూస్టింగ్ ఇచ్చింది. ‘నా పేరు శివ‌’, ‘శకుని’ సహా పలు సినిమాల్లో నేచురల్ యాక్టింగ్ తో  ఆహా అనిపించాడు. నాగార్జునతో కలిసి నటించిన ‘ఊపిరి’ మూవీ కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో తెలుగులోనూ ఆయనకు ఫ్యాన్ బేస్ పెరిగింది. ఆ తర్వాత ‘ఖైదీ’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది ‘సుల్తాన్’ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆడింది. ఇక మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘జపాన్’ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది.


‘మేయిఅల‌గ‌న్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్


ఇక తాజాగా కోలీవుడ్ స్టార్ యాక్టర్లు కార్తి, అరవింద స్వామి ప్ర‌ధాన పాత్ర‌లో ‘మేయిఅల‌గ‌న్’ అనే సినిమా చేస్తున్నారు.  ఈ సినిమాకు  ప్రేమ్ కుమార్ .సీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సూర్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. మొత్తంగా వరుస సినిమాలతో మంచి సినీ కెరీర్ కొనసాగిస్తున్న కార్తి 47వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, ప్రేక్షకులు శుభాకాంక్షలు చెప్తున్నారు. కార్తి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కెరీర్ లో ఆయన  మరిన్ని హిట్లు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ‘ఏబీపీ దేశం‘ కూడా కార్తికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.


Read Also: అమ్మ మళ్లీ తిరిగి వస్తుంది అనిపిస్తుంది- ఆ మాటలు కంటతడి పెట్టించాయన్న జాన్వీ కపూర్