Janhvi Kapoor About Her Mother Sridevi : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. తన తల్లి, దివంగత అతిలోక సుందరి శ్రీదేవి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆమె తాజా చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. తాజాగా ఓ ఛానెల్ తో మాట్లాడిన ఆమె తన తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకుంది. తను చనిపోయినట్లు ఇప్పటికీ తాము భావించడం లేదని వెల్లడించింది. ఆమె మళ్లీ తిరిగి వస్తుందనే ఆలోచనలోనే ఉన్నట్లు వివరించింది. “మా అమ్మ చనిపోయిందనే భావన ఇప్పటికీ మాకు కలగడం లేదు. తను ఏదో పని మీద దూర ప్రయాణానికి వెళ్లింది. త్వరలో తిరిగి ఇంటికి వస్తుంది అనే ఆలోచనలోనే ఉన్నాం” అని జాన్వీ చెప్పుకొచ్చింది.  


అమ్మ చనిపోయాక కొందరు చేసిన కామెంట్స్ బాధించాయి- జాన్వీ కపూర్  


తన తల్లి శ్రీదేవి చనిపోయిన తర్వాత తనపై కొందరు చేసిన కామెంట్స్ బాధించాయని జాన్వీ ఆవేదన వ్యక్తం చేసింది. తాను నటించిన తొలి సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందే అమ్మ చనిపోయిందని చెప్పిన ఆమె, దుఃఖంలోనే ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నట్లు తెలిపింది. “నేను నటించి తొలి సినిమా ‘ధడక్’ విడుదలకు కొద్ది రోజుల ముందే అమ్మ చనిపోయింది. ఆ బాధ నుంచి పూర్తిగా బయటకు రాక ముందే ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి వచ్చింది. ప్రమోషన్స్ లో భాగంగా ఓ రియాలిటీ షోకు వెళ్లాను. అక్కడ అమ్మకు నివాళిగా తన పాటలకు ఓ ప్రదర్శన ఇచ్చారు. వారు అద్భుతంగా చేసినప్పటికీ నేను చూడలేకపోయాను. చాలా ఏడుపు వచ్చింది. వెంటనే షో నుంచి వెళ్లిపోయాను” అని వివరించింది.


నెగెటివ్ కామెంట్స్ బాధ పెట్టాయి- జాన్వీ కపూర్


అమ్మ చనిపోయినా నేను బాధ పడటం లేదని అప్పట్లో కొందరు నెగెటివ్ కామెంట్స్ చేశారని, అవి తనను ఎంతో బాధించాయని చెప్పింది జాన్వీ. “అమ్మ చనిపోయినా, నేను హ్యాపీగానే ఉన్నానని అప్పట్లో కొందరు కామెంట్స్ చేశారు. వాటిని చూసి చాలా బాధపడ్డాను. ఆమె చనిపోయిన తర్వాత ఆ బాధ నుంచి బయటకు వచ్చేందుకు ఎంతో ప్రయత్నించాను. అయినా, బయటి వాళ్లకు ఇంట్లో విషయాల గురించి ఏం తెలుస్తుంది? మా బాధను అర్థం చేసుకోకుండా చేసిన కామెంట్స్ నన్ను చాలా బాధపెట్టాయి. కొద్ది రోజుల తర్వాత నెగెటివ్ కామెంట్స్ చేసే వారిని పట్టించుకోవడం మానేశాను” అని వివరించింది.


వరుస సినిమాలతో ఫుల్ బిజీ


జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె నటించిన ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ మే31న విడుదల కానుంది. ఈ సినిమాకు శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో పాటు టాలీవుడ్ లో  రెండు సినిమాలు చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ‘దేవర’ సినిమాలో నటిస్తోంది. అటు రామ్ చరణ్- బుచ్చి బాబు మూవీలోనూ హీరోయిన్ గా చేయనుంది.






Read Also: తెలుగు డాక్యుమెంటరీ ‘బర్నింగ్ బ్రిడ్జెస్’కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, దీని ప్రత్యేకలు ఇవే