‘Burning Bridges’ Documentary: కథలైనా, సినిమాలైన మనకు ఎదురైన, చూసిన పరిస్థితుల నుంచే పుడతాయి. ‘బర్నింగ్ బ్రిడ్జెస్’ డాక్యుమెంటరీ కూడా అలా పుట్టిందే. దర్శకుడు ఫణీంద్ర అడపాల ఓ రోజు వెళ్తూ వెళ్తూ అగ్నిమాపక కేంద్రాన్ని చూశారు. అక్కడ ఉన్న సిబ్బంది గురించి ఆలోచించారు. రకరకాల ప్రమాదాలను చూసినప్పుడు వారు ఎలాంటి భావోద్వేగాలకు గురయ్యారో తెలుసుకోవాలని భావించారు. అలా ‘బర్నింగ్ బ్రిడ్జెస్’ డాక్యుమెంటరీకి బీజం పడింది. అగ్నిమాపక సిబ్బందికి ఎదురైన పరిస్థితులను, అనుభవించిన బాధను దృశ్యరూపంగా మార్చారు. 55 నిమిషాల పాటు ఉన్న ఈ డాక్యుమెంటరీకి 14వ దాదా సాహబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ (DSPFF-24)లో జ్యూరీ అవార్డు దక్కించుకుంది. జూన్‌లో జరగనున్న ఇండియన్ ఫిల్మ్ హౌస్ (IFH) జాతీయ అవార్డులలో రెండు విభాగాల్లో విజేతగా నిలిచింది.
‘బర్నింగ్ బ్రిడ్జెస్’కు బీజం ఎలా పడిందంటే?
ఫణీంద్ర ఓ రోజు హైటెక్ సిటీ నుంచి సైనిక్‌పురికి ప్రయాణిస్తున్నప్పుడు సికింద్రాబాద్ అగ్నిమాపక కేంద్రాన్ని చూశారు. ఆ తర్వాత ఒక కేఫ్‌లో, ప్రజలు అగ్నిప్రమాదం గురించి మాట్లాడుకోవడాన్ని గమనించారు. అదే సమయంలో పలు పత్రికలలో వచ్చిన వార్తాలను చూశాడు. ఇవన్నీ గమనించిన అతడికి అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన జీవితాలను, వారికి ఎదురైన అనుభవాలను తెలుసుకోవాలని భావించారు. పనిలో పనిగా ఓ డాక్యుమెంటరీని రూపొందించాలని అనుకున్నారు.
డాక్యుమెంటరీ కోసం ఏం చేశారంటే?
‘బర్నింగ్ బ్రిడ్జెస్’ డాక్యుమెంటరీ కోసం ఫణీంద్ర ముందుగా తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్(ఫైర్) వై.నాగిరెడ్డి పర్మిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత ప్యారడైజ్ (సికింద్రాబాద్ జనరల్ ఫైర్), మాదాపూర్ (ఎత్తైన భవనంలో అగ్నిప్రమాదం), జీడిమెట్ల(ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం)లో పాల్గొన్న అగ్నిమాపక సిబ్బందిని ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నాడు. కానీ, మాదాపూర్, సికింద్రాబాద్ ఫైర్ కేంద్రాలకు సంబంధించిన సిబ్బందిని ఇంటర్వ్యూ చేశారు. "ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో అగ్ని మాపక సిబ్బంది చెప్పిన మాటలు విని కన్నీళ్లు వచ్చాయి. అగ్ని ప్రమాదంలో తల్లీ కొడుకు చనిపోయిన ఘటన, ఓ యువ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన, ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న చిన్నారులు, అగ్ని ప్రమాద సమయంలో స్థానికుల నుంచి ఎదురైన ఇబ్బందులు చెప్తుంటే భావోద్వేగానికి గురయ్యాను. నిజంగా ఫైర్ సిబ్బంది తెగింపు ఎంతో గొప్పది. వారిని తప్పకుండా గౌరవించాలి” అని ఫణీంద్ర తెలిపారు.
ఇంతకీ ఫణీంద్ర ఎవరు?
ఫణీంద్ర నిర్మలా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను రన్ చేస్తున్నారు. కార్పొరేట్ ఫిల్మ్స్, షోలు, ప్రోడక్ట్ షూట్లతో పాటు సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అతను త్వరలో ‘1981లో ఇంద్రవెల్లి’ అనే సినిమా తెరకెక్కించబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగిస్తున్నారు.
Read Also: ‘RRR’ టీమ్‌తో కలిసి వర్క్ చేయాలనుంది - మనసులో మాట బయటపెట్టిన ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ నటి