Anne Hathaway On ‘RRR’ Movie: భారతీయ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. ఇండియాతో పాటు హాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ తో పాటు ఆస్కార్ అవార్డులను అందుకుంది. ఈ సినిమాపై పలువురు హాలీవుడ్ నటులు, దర్శకులు ప్రశంసలు కురిపించారు. దర్శకుడు రాజమౌళితో పాటు, ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి పని చేయాలనుందని తమ మనసులో మాట బయటపెట్టారు.  


‘RRR’పై హాలీవుడ్ బ్యూటీ ప్రశంసలు


తాజాగా ‘RRR’ సినిమాపై మరో హాలీవుడ్ స్టార్ ప్రశంసలు కురిపించింది. ఆస్కార్ విన్నింగ్ నటి అయిన అన్నే హాత్వే ఈ సినిమా అద్భుతం అంటూ పొగడ్తలు కురిపించింది. ‘RRR’ టీమ్‌తో కలిసి పని చేయాలనుందని చెప్పుకొచ్చింది. “అందరికీ నచ్చినట్లే ‘RRR’ సినిమా నాకు కూడా చాలా నచ్చింది. ఈ చిత్రబృందంతో కలిసి ఎవరైనా పని చేయాలి అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకుంటున్నాను” అని చెప్పింది. ప్రస్తుతం అన్నే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.   


అన్నే హాత్వే హలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. ‘ఇంటర్ స్టెల్లార్’, ‘బ్రైడ్ వార్స్’, ‘పాసెంజర్స్’, ‘లెస్ మిసెర్బుల్స్’, ‘ది ఇంటర్న్’ పలు బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది. తాజాగా రొమాంటిక్ కామెడీ మూవీ ‘ది ఐడియా ఆఫ్ యూ’ సినిమాలో నటించింది.  ఈ చిత్రానికి మైఖేల్ షోవాల్టర్ దర్శకత్వం వహించారు. ‘రాబిన్ లీస్’ అనే నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్ లో అన్నే హాత్వే ‘RRR’ పై ప్రశంసలు కురిపించింది.



పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్


‘RRR’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తోంది. అటు రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ నటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. 


మహేష్ బాబుతో రాజమౌళి సినిమా


అటు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ‘SSMB 29’ పేరుతో ఈ సినిమా పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Also Read: హీరోయిన్‌ కాదని దెయ్యాన్ని ప్రేమించిన హీరో, ఇంతకి ఎవరా దివ్యవతి - ఆసక్తి పెంచుతున్న లవ్ మీ రిలీజ్‌ ట్రైలర్‌