శివ శంకర్ మాస్టర్...
ఈ తరంలో కొందరికి ఆయన నటుడిగా తెలుసు!
మరికొంత మందికి ఆయన న్యాయనిర్ణేతగా తెలుసు!
పరిశ్రమకు మాత్రం ఆయన గొప్ప నృత్య దర్శకుడిగా తెలుసు!
శివ శంకర్ మాస్టర్ మాత్రమే చేయగలిగిన పాటలు కొన్ని ఉంటాయి. శివ శంకర్ మాస్టర్ చేయలేని పాటలు ఏమీ ఉండవు. మంచు మనోజ్ చేత 'మన్మథ రాజా' అంటూ స్టెప్పులు వేయించారు. 'మగధీర'లో 'ధీర... ధీర' చేశారు. క్లాసు... మాసు... అన్ని తరహా పాటలు చేశారు. దాదాపుగా హీరోలు అందరితో చేశారు. అదీ ఆయన గొప్పదనం.
ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణ సినిమాలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేశారు. వారితో కొన్ని స్టెప్పులు వేయించారు. ఆ తర్వాత తరంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సినిమాల్లో పాటలకూ కొరియోగ్రఫీ చేశారు. చిరు తనయుడు రామ్ చరణ్, మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్‌తో కూడా పని చేశారు. కొరియోగ్రాఫర్ నుంచి నటుడిగా మారారు. ఆ తర్వాత డాన్స్ రియాలిటీ షోల్లో జడ్జ్‌గా కనిపించారు. సినిమా పరిశ్రమలో ఆయనది 45 ఏళ్ల ప్రయాణం. తెలుగు, తమిళంతో పాటు సుమారు 10 భాషల్లో, 800లకు పైగా సినిమాల్లో పాటలకు ఆయన కొరియోగ్రఫీ అందించారు. ఈ ప్రయాణం... అంతకు ముందు నృత్యం నేర్చుకోవడం, ఆయన జీవితం పూలపాన్పు ఏమీ కాదు. శివ శంకర్ మాస్టర్ జీవితంలో విజయాలు ఉన్నాయి. విషాదమూ ఉంది. ఓ సినిమాలో ఉన్నంత డ్రామా ఆయన జీవితంలో ఉందని చెప్పాలి.
జాతకం మార్చిన జీవితం!
చెన్నైలోని కొత్వాల్ చావిడిలో పండ్ల వ్యాపారం చేసే కల్యాణ సుందర్, కోమల అమ్మాళ్ దంపతులకు డిసెంబరు 7న, 1948లో శివ శంకర్ జన్మించారు. ఆయన తల్లికి తొమ్మిదిమంది అక్కలు. అమ్మమ్మ ఇంట్లో ఎప్పుడూ సందడిగా ఉండేది. శివ శంకర్‌కు ఏడాదిన్నర వయసు ఉన్నప్పుడు... ఆ తొమ్మిది మందిలో ఒకరు ఇంటి దగ్గర ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. ఓ ఆవు అటుగా వచ్చింది. ఆవిడ భయపడింది. ఇంట్లోకి పరుగు తీసే క్రమంలో కింద పడటంతో శివ శంకర్ వెన్నెముక విరిగింది. ఎనిమిదేళ్లు చికిత్స తీసుకుంటే తప్ప మళ్లీ లేచి నడవలేకపోయారు. అటువంటి కుర్రాడు భవిష్యత్తులో డాన్స్ చేస్తాడని, డాన్స్ పట్ల ఆకర్షితుడు అవుతాడని, కొరియోగ్రాఫర్ అవుతారని ఎవరైనా ఊహించగలరా? అసలు, ఆయన డాన్స్ పట్ల ఆకర్షితుడు కావడానికి కారణం ఆయన తండ్రి కల్యాణ సుందరే. ఆయనకు పాటలు అంటే ఇష్టం. నాటకాలు, డాన్సులు చూస్తానని కుమారుడు కోరితే... డ్రైవర్, కారు ఇచ్చి మరీ పంపేవారు. నాటకాలు, నృత్య ప్రదర్శనలు చూసి... శివ శంకర్‌కు కూడా నృత్యం మీద ఆసక్తి పెరిగింది. సంప్రదాయ నృత్యం నేర్చుకుంటానని అంటే ఇంట్లో ఒప్పుకోలేదు. పెద్దమ్మలు అందరూ ఒకటే తిట్లు. తండ్రి కూడా వద్దన్నారు. అయితే, శివ శంకర్ తన ఇష్టాన్ని వదులుకోలేదు. అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసేవారు. అద్దంలో చూసుకుని అందగాడినని కుమారుడు ఫీలవుతున్నాడని శివ శంకర్ తండ్రి అనుకున్నారు. కొడుక్కి అందం పిచ్చి పట్టుకుందేంటని జాతకం చూపించారు. 'నీ కుమారుడు గొప్ప డాన్సర్ అవుతాడు' అని ఆయనతో పండితులు చెప్పడంతో... శివ శంకర్‌ను స్వయంగా ఆయనే ఓ గురువు దగ్గర చేర్పించారు.
అప్పట్లో లక్ష రూపాయలు ఖర్చుపెట్టి!
శివ శంకర్ మాస్టర్ క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నప్పుడు... సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. సంప్రదాయ నృత్య ప్రదర్శనతో అరంగేట్రం చేశారు. అయితే... ఆ తర్వాత నృత్య ప్రదర్శనలు ఇవ్వడానికి డబ్బుల్లేవు. అప్పుడు సంప్రదాయ నృత్యం నుంచి సినిమాల్లోకి ఎలా వచ్చారంటే... శివ శంకర్ జాతకం చూపించిన తండ్రి, కొడుకును తీసుకువెళ్లి నటరాజ, శకుంతల అనే ఇద్దరు నృత్య విద్వాంసుల దగ్గర చేర్పించారు. సుమారు ఏడేళ్ల పాటు నృత్యం నేర్చుకున్నారు. ఆ తర్వాత 1974లో అరంగేట్రం చేశారు. ఆ రోజుల్లో సుమారు లక్ష రూపాయలు ఖర్చుచేసి తన అరంగేట్రం కోసం తండ్రి లక్ష రూపాయలు ఖర్చు చేశారని శివ శంకర్ మాస్టర్ ఓ సందర్భంలో తెలిపారు. ఆ తర్వాత అవకాశాలు వస్తాయని అనుకుంటే... రాలేదు. మరోవైపు నృత్య ప్రదర్శనలు ఇవ్వాలంటే లక్షల్లో ఖర్చు. తండ్రి ఏమో ఒక్క పైసా అడగొద్దని ఆర్డర్ వేశారు. దాంతో కజిన్ సిస్టర్ భర్త ద్వారా ప్రముఖ నృత్య దర్శకుడు సలీం దగ్గర సహాయకుడిగా చేరారు. తర్వాత పసుమర్తి కృష్ణమూర్తి, సుందరం, చిన్ని సంపత్, హీరాలాల్ దగ్గర అసిస్టెంట్‌గా చేశారు.
'ఖైదీ'... అనుకోని అవకాశం!
సలీం మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా శివ శంకర్ మాస్టర్ చేసిన తొలి సినిమా 'పాట్టుమ్ భరతముమ్'. అంటే 'పాట... ఆట' అని అర్థం. శివాజీ గణేశన్, జయలలిత నటించిన సినిమా అది. ఆ తర్వాత తమిళ, తెలుగు భాషల్లో పలు సినిమాలు చేశారు. ఎన్టీఆర్ 'అడవి రాముడు'కు కూడా సలీం దగ్గర సహాయకుడిగా చేశారు. ఇంకా ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణ సినిమాలకు పని చేశారు. సూర్య తండ్రి శివకుమార్ హీరోగా నటించిన 'కురువి కూడు'తో శివ శంకర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అయ్యారు. అయితే... తెలుగులో కొరియోగ్రాఫర్‌గా చేసిన తొలి సినిమా 'ఖైదీ'. అది ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ సినిమాలో 'రగులుతుంది మొగలి పొద' పాట ఆయనకు ఎంతో పేరు తీసుకొచ్చింది. నిజానికి, ఆ పాట సలీం మాస్టర్ చేయాల్సింది. షూటింగ్ వాయిదా పడటంతో శివ శంకర్ మాస్టర్‌కు చేసే అవకాశం వచ్చింది. పాట అయితే చేశారు కానీ... చిన్నతనంలో వెన్నుముకకు అయిన గాయం కారణంగా మూడు నెలలు తీవ్రమైన నొప్పులతో బాధపడాల్సి వచ్చింది. పాట హిట్ అవ్వడంతో ఆ కష్టం మర్చిపోయానని ఆయన చెప్పేవారు. ఆ తర్వాత సుమారు 800లకు పైగా సినిమాల్లో పాటలకు కొరియోగ్రఫీ అందించారు. తెలుగులో ఆయన కొరియోగ్రఫీ చేసిన సినిమాల్లో 'అమ్మోరు', 'యమదొంగ', 'అరుంధతి', 'మహాత్మ' చెప్పుకోదగినవి. 'మగధీర'లో 'ధీర... ధీర' పాటకు నేషనల్ అవార్డు అందుకున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాలుగుసార్లు అవార్డులు అందుకున్నారు.
డ్యాన్సే కాదు... యాక్షన్ కొరియోగ్రఫీ... యాక్టింగ్ కూడా!
శివ శంకర్ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ మాత్రమే కాదు, యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చేశారు. తమిళంలో అజిత్ హీరోగా కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించిన సినిమా 'వరలారు'. అందులో అజిత్ భరతనాట్యం డాన్సర్‌గా కనిపిస్తారు. అజిత్ బాడీ లాంగ్వేజ్‌తో పాటు యాక్షన్ సీన్స్ కూడా డిజైన్ చేయమని దర్శకుడు అడగటంతో చేశారు. ఆయన మాత్రమే చేయగలరని కె.ఎస్. రవికుమార్ చేయించారట. ఒకవేళ తాను చేసింది దర్శకులకు నచ్చకపోయినా మళ్లీ కొత్తగా కంపోజ్ చేయడానికి శివ శంకర్ మాస్టర్ ఏమాత్రం సంకోచించేవారు కాదు. 'మగధీర'లో 'ధీర... ధీర' పాటకు ఆరు రకాల కంపొజిషన్స్ చేశారు.
తమిళ సినిమా 'వరలారు'లో ఆయన ఓ రోల్ కూడా చేశారు. అంతకు ముందు నటుడిగా రెండు మూడు సినిమాలు చేసినా... ఆ సినిమా ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత నటుడిగా తెలుగులో 'అల్లరి' నరేష్ 'సుడిగాడు', రానా 'నేనే రాజు నేనే మంత్రి', ఎన్టీఆర్ బయోపిక్ 'యన్.టి.ఆర్: కథానాయకుడు', 'రాజు గారి గది'... తమిళంలో 'పరదేశి', 'కన్నా లడ్డు తిన్న ఆసియా', 'అరణ్మణై', సూర్య 'గ్యాంగ్' తదితర సినిమాల్లో నటించారు. తమిళంలో నటుడిగా 30 సినిమాలు చేశారు. ఓంకార్ హోస్ట్ చేసిన డాన్స్ రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. నటుడిగా మంచి కామెడీ పాత్రలు చేయాలని శివ శంకర్ మాస్టర్ ఆశపడ్డారు.
Also Read: 'ఆచార్య' సెట్స్ లో కలిశా.. అదే చివరిసారి అవుతుందనుకోలేదు.. చిరు ఎమోషనల్ పోస్ట్..
Also Read: కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఇకలేరు..
Also Read: నడవలేడనుకున్న మనిషి.. కొరియోగ్రాఫర్ గా మారి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Shiva Shankar Master: అవకాశాలు రాక... నృత్య ప్రదర్శనలకు డబ్బుల్లేక... సినిమాల్లోకి! ఇదీ శివ శంకర్ మాస్టర్ జర్నీ!
ABP Desam
Updated at:
28 Nov 2021 11:17 PM (IST)
సంప్రదాయ నృత్యకారుడిగా తెరంగేట్రం చేసిన శివ శంకర్ మాస్టర్ సినిమాల్లోకి ఎందుకు వచ్చారు? ఆయన జీవితంలో కీలక మలుపులు ఏమిటి?
శివ శంకర్ మాస్టర్
NEXT
PREV
Published at:
28 Nov 2021 10:57 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -