ముంబై బేస్ గా కొనసాగుతున్న సినీ పరిశ్రమను బాలీవుడ్ గా వ్యవహరిస్తుంటాం. అక్కడ నిర్మితమయ్యే సినిమాలను బాలీవుడ్ ఫిల్మ్స్ గా  పిలుస్తుంటాం. ఇంకా చెప్పాలంటే హిందీ చిత్ర పరిశ్రమను ఓవరాల్ గా బాలీవుడ్ అనే పిలుస్తాం. కానీ, ఈ బాలీవుడ్ అనే పదం హాలీవుడ్ నుంచి వచ్చిందనే విషయం మనలో చాలా మందికి తెలియదు. హాలీవుడ్ లో ఒక నాటకం పేరు ‘బాలీవుడ్’. ఇది బొంబాయి బేస్ గా రూపొందిన నాటకం. అదే సమయంలో 1970లో ఓ పత్రిక గాసిప్ కాలమ్‌లో ఓ విలేఖరి తొలిసారి బాలీవుడ్ అనే పదాన్ని ఉపయోగించారు. బొంబాయి కేంద్రంగా ఉన్న సినిమా పరిశ్రమను సూచిస్తూ ఆయన ఈ పదాన్ని ఉపయోగించారు. అయితే, అప్పటి నుంచి దేశవ్యాప్తంగా బాలీవుడ్ పేరు మాత్రమే వినిపించేది. దీనివల్ల విదేశీయులు సైతం ఇండియన్ మూవీస్ అంటే ‘బాలీవుడ్’ అనే భావిస్తున్నారు. తాజాగా ఆస్కార్ అవార్డుల్లో కూడా హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ ‘‘నాటు నాటు’’ పాటను బాలీవుడ్ సాంగ్‌గా అభివర్ణించడం ఆశ్చర్యం కలిగించింది. ఇండియాలోని సినీ ఇండస్ట్రీపై ఆయనకు ఆ మాత్రం అవగాహన లేదా అంటూ మీడియా జిమ్మీని తిట్టిపోసింది. అయితే, ఇప్పుడు ‘‘నాటు నాటు’’ వల్ల తెలుగు సినీ పరిశ్రమ గురించి ప్రపంచం మాట్లాడుకుంటోంది. ఇండియన్ సినిమా అంటే ‘బాలీవుడ్’ మాత్రమే కాదనే విషయం స్పష్టమైంది. ఒకప్పుడు ప్రాంతీయ చిత్రాలను చిన్న చూపు చూసిన బాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే, బాలీవుడ్‌‌కు కూడా ఒక చరిత్ర ఉంది. దాని గురించి మనం తెలుసుకుందాం. 


భారతీయ సినిమాకు మార్గదర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే


భారతీయ సినిమా పరిశ్రమ అభివృద్ధి 19వ శతాబ్దం నుంచి మొదలైంది. భారతీయ సినిమాకి మార్గదర్శకుడైన దాదాసాహెబ్ ఫాల్కే 1913లో ‘రాజా హరిశ్చంద్ర’ను నిర్మించారు. ఇది ఓ హిందీ మూకీ సినిమా. అంతేకాదు, పూర్తి నిడివిగల తొలి భారతీయ సినిమాగా గుర్తింపు పొందింది. రవి వర్మ చిత్రాల నుంచి ప్రభావితుడైన ఫాల్కే ఈ సినిమాను నిర్మించారు. బిజినెస్ పరంగా ఈ సినిమా  విజయవంతమైంది. ఈ సినిమాలో అందరూ మగవాళ్లే నటించారు. ఆడవారి వేషాలు కూడా మగవాళ్లే ధరించారు. ఈ సినిమా సుమారు 40 నిమిషాల పాటు ఉంటుంది.


1913 నుంచి మొదలుకొని 1918 వరకు 23 సినిమాలను తీశారు ఫాల్కే. నెమ్మదిగా హిందీ చిత్ర పరిశ్రమ అభివృద్ధి దిశగా అడుగులు వేసింది. ప్రస్తుతం ఏటా 1000 సినిమాలను నిర్మించే స్థాయికి చేరింది. 1913 తర్వాత బాంబే ఫిల్మ్ బిజినెస్ ను బాలీవుడ్ గా వ్యవహరించడం మొదలు పెట్టారు. 1920ల ప్రారంభంలో కొత్త నిర్మాణ సంస్థలు ఏర్పడ్డాయి. 20వ శతాబ్దాన్ని పురాణ, చారిత్రక ప్రాధాన్యతపై ఆధారపడి వచ్చిన చిత్రాలు ఏలాయి. భారతీయ ప్రేక్షకులు హాలీవుడ్ చిత్రాలను, ముఖ్యంగా యాక్షన్ చిత్రాలను కూడా ఆదరించారు.


సినీ పరిశ్రమలో ‘ఆలం ఆరా’ ఓ సంచలనం


1931లో అర్దేశిర్ ఇరానీ దర్శకత్వం వహించిన తొలి టాకీ చిత్రం ‘ఆలం ఆరా’ బొంబాయిలో ప్రదర్శించారు. ఇది భారతదేశపు తొలి ధ్వని చిత్రం. ఆలం అరా ప్రీమియర్ భారతీయ చలనచిత్ర చరిత్రలో కొత్త శకానికి సంకేతం. 'దే దే ఖుదా కే నామ్ పర్' 1931లో ఆలం అరా కోసం పాడిన మొట్టమొదటి పాట.  1950ల వరకు రంగుల చిత్రాలు ప్రజాదరణ పొందలేదు.ఎందుకంటే ప్రజలు ఇతర కళా ప్రక్రియల కంటే శృంగారం, మెలోడ్రామా, సంగీతాలను ఎక్కువగా ఆస్వాదించారు. ఆ తర్వాత  నిర్మాణ సంస్థలు అభివృద్ధి చెందాయి. విడుదలైన చిత్రాల సంఖ్య పెరిగింది. 1927లో, 108 సినిమాలు నిర్మించారు. 1931లో 328కి పెరిగాయి. ఈ కాలంలో భారీ సినిమా థియేటర్లు స్థాపించారు. సినిమా ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 1930, 1940లలో దేబాకి బోస్, చేతన్ ఆనంద్, S.S. వాసన్, నితిన్ బోస్ మొదలైన అనేక మంది ప్రముఖ సినీ వ్యక్తులు ఉద్భవించారు.


ప్రాంతీయ చలనచిత్ర నిర్మాణ విస్తరణ


బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాదు,  ప్రాంతీయ సినిమాల నిర్మాణం కూడా మొదలయ్యింది. 1919లో ‘కీచక వధం’ అనే పేరుతో మొట్టమొదటి సౌత్ ఇండియన్ చలనచిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి మద్రాసు (చెన్నై)కి చెందిన ఆర్. నటరాజ ముదలియార్ దర్శకత్వం వహించారు. దాదాసాహెబ్ ఫాల్కే కుమార్తె మందాకిని, ఫాల్కే యొక్క 1919 చిత్రం ‘కాళీయ మర్దాన్‌’లో కృష్ణునిగా నటించిన మొదటి కిడ్ సెలబ్రిటీ (అమ్మాయిల్లో). బెంగాలీ, అస్సామీ, రాజస్థానీ, పంజాబీ, మరాఠీతో పాటు ఇతర సంస్కృతులలో ప్రాంతీయ చలనచిత్రాలు కూడా నిర్మించబడ్డాయి.


Read Also: మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై కీరవాణి కీలక వ్యాఖ్యలు - ఫ్యాన్స్‌కు పండుగే!