ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దేశంలో జరగనున్న జీ 20 సదస్సుకు హాజరుకావాలని ఆయా దేశాధినేతలకు రాష్ట్రపతి భవన్ ఆహ్వానాలను పంపించింది. ఇందులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’గా సంబోధిస్తూ ఆహ్వాన పత్రికలను ముద్రించారు. ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాయడం సంచలనంగా మారింది. తీవ్ర వివాదానికి దారితీసింది.


‘ఇండియా’ పేరు మార్పుపై జాకీ ష్రాఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు


ఇండియా పేరును భారత్‌ గా మారుస్తారన్న ప్రచారం దేశ వ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది.  ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా ప్రజలతో పాటు ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా  ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ దేశం పేరు మార్పుపై స్పందించారు. ఢిల్లీలో జరిగిన  ప్లానెట్ ఇండియా ప్రచారానికి ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాలో మాట్లాడారు. ఇండియా పేరును భారత్‌గా మార్చడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇండియాను భారత్ గా మార్చడంలో ఎలాంటి తప్పు లేదన్నారు.  “ఇండియాను భారత్ అని పిలిస్తే తప్పేం ఉంది?  నా పేరు జాకీ ష్రాఫ్. చాలామంది నన్ను Jackie అని పిలుస్తారు. మరికొంత మంది Jockey  అని పిలుస్తారు. ప్రజలు ఎవరికి నచ్చినట్లుగా వారు పిలుస్తారు. కానీ, నేను మారలేదు కదా. అయినా, మనం ఎలా మారతాం? పేరు మారవచ్చు. కానీ, మనం మారలేం” అని జాకీ తెలిపారు.






‘భారత్ మాతాకీ జై’ అంటూ బిగ్ బీ ట్వీట్ 


దేశ వ్యాప్తంగా  ఇండియా పేరు మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో  బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు.  దీనికి జాతీయ పతాకం త్రివర్ణ పతాకాన్ని యాడ్ చేశారు.  ఈ ట్వీట్ పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. పేరు మార్పుకు అమితాబ్ మద్దతు పలకడంపై కొంత మంది సానుకూలంగా స్పందిస్తుంటే, మరికొంత మంది ఆయనను విమర్శిస్తున్నారు.  


త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇండియా పేరు మార్పు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. మరోవైపు జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాల కోసం కోసం ప్రత్యేక కమిటీని నియమించడం, యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు అంశంపైనా తీవ్ర చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం, ఈ సమావేశాల్లోనే పార్లమెంట్ సభ్యుల గ్రూప్ ఫోటో సెషన్ నిర్వహించనుండటం వెనుక ఏదో పెద్ద కథే ఉన్నట్లు టాక్ నడుస్తోంది. 


Read Also: 'విక్రమ్'తో కంపేరిజన్ మీద స్పందించిన నెల్సన్ - లోకేష్‌కు 'జైలర్' కథ ఎప్పుడో చెప్పా!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial