తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘జైలర్’. ఆగష్టు 10న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 650 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. రజనీకాంత్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా ‘జైలర్’ నిలిచింది. నెల్సన్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ భారీ సినిమాను సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్‌ నిర్మించారు.


కథ రాసుకున్నప్పుడే హిట్ అవుతుందనుకున్నా!


‘జైలర్’ అద్భుత విజయాన్ని అందుకున్న నేపథ్యంలో దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. పనిలో పనిగా ‘జైలర్’ మూవీ, ‘విక్రమ్’ చిత్రం కథ ఒకేలా ఉందని వస్తున్న విమర్శలపైనా ఆయన స్పందించారు. విజయ్ దళపతితో కలిసి ‘బీస్ట్‌’ సినిమా తెరకెక్కిస్తున్న టైమ్ లోనే తనకు ‘జైలర్‌’ సినిమా ఆలోచన వచ్చిందని చెప్పారు. అంతేకాదు ‘జైలర్‌’ కథ రాసుకున్నప్పుడే విజయాన్ని అందుకుంటుందని భావించినట్లు వెల్లడించారు. అయితే, ఈ స్థాయిలో బ్లాక్ బస్టర్ అవుతుందని ఊహించలేదన్నారు. ‘జైలర్’ హిట్ తర్వాత తన మనసు ప్రశాంతంగా మారిందని చెప్పారు.   


‘విక్రమ్’ విడుదలకు ముందే ‘జైలర్’ కథ చెప్పా!


అటు కమల్ హాసన్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘విక్రమ్’ కథ, రజనీ ‘జైలర్‌’ మూవీ కథ ఒకేలా ఉందనే విమర్శలపైనా నెల్సన్‌ దిలీప్ కుమార్ స్పందించారు. ‘విక్రమ్’ విడుదలకు ముందే ‘జైలర్’ కథను రాసినట్లు చెప్పారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన  ‘విక్రమ్’ చిత్రంలో తన కొడుకు మరణానికి కారణమైన వ్యక్తులను మాజీ సీక్రెట్ ఏజెంట్ వేటాడుతారు. మరోవైపు, ‘జైలర్’లో తన కొడుకు ప్రాణాలను కాపాడటానికి మాజీ పోలీసు అధికారి పోరాడుతారు.  ఇద్దరు హీరోలు తమ పాత పరిచయస్తులు, స్నేహితుల సాయంతోనే తమ పనులను పూర్తి చేస్తారు. ఇంచుమించు రెండు సినిమాల కథలు ఒకేమాదిరగా అనిపిస్తాయి. అయితే, ‘జైలర్’ కథను లోకేష్ కు గతంలోనే చెప్పినట్లు నెల్సన్ వెల్లడించారు. “నేను ‘జైలర్’ కథను లోకేష్‌కి చాలా కాలం క్రితం చెప్పాను. అతడు నన్ను విక్రమ్‌ని చూడమని అడిగాడు. అతడు తన సినిమాలోని విషయాలు ఇవి అని నాకు చెప్పాడు. నేను అతనితో నా సినిమా కథ గురించి చెప్పాను. ‘విక్రమ్’ జూన్ లో విడుదల అయితే, నేను జనవరిలోనే ‘జైలర్’ కథ లోకేష్ కు చెప్పాను. బహుశా రెండు సినిమాల టేకాఫ్ ఒకేలా ఉండవచ్చు. కానీ, ‘జైలర్’ వేరే టాంజెంట్‌లో వెళ్తాడు. ఏది ఏమైనా రెండు కథలను ప్రేక్షకులు బాగానే ఎంజాయ్  చేశారు” అని వెల్లడించారు.


సెప్టెంబర్ 7నుంచి ‘జైలర్’ ఓటీటీ స్ట్రీమింగ్


ఇక అద్భుత విజయాన్ని అందుకున్న ‘జైలర్’ మూవీ సెప్టెంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రానుంది. ఈ చిత్రంలో తమన్నా, జాకీష్రాఫ్‌, మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌, సునీల్‌, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో నటించింది. అనిరుధ్ సంగీతం అందించారు.


Read Also: రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా పెళ్లి ముహూర్తం ఫిక్స్ - ఏడు అడుగులు వేసేది ఎక్కడంటే?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial