ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఐటీ నోటీసుల వ్యవహారంతో ఏపీ సీఐడీ స్పీడ్ పెంచనుంది. ఈ నోటీసులకు గతంలో రిజిస్టర్ అయిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు లింకు పెట్టి దర్యాప్తు చేయాలని భావిస్తోంది. రెండింటిలో వినిపిస్తున్న పేర్లు ఒకేలా ఉన్నాయని చెబుతూ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని చూస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. 


చంద్రబాబుకు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులతో మరోసారి సీఐడీ రంగంలోకి దిగింది. ఐటీ నోటీసుల్లో పేర్కొన్న పేర్లు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో వెలుగులోకి వచ్చిన పేర్లు ఒకేలా ఉన్నాయని సీఐడీ భావిస్తోంది. రెండింటి మూలాలు ఒకేచోట ఉన్నాయని దీనిపై మరింత లోతుగా విచారణ జరపాలని నిర్ణయించిందట. ఈ రెండు కేసుల్లో డబ్బులు చేరింది ఒక వ్యక్తి దగ్గరికే అని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయట. ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల్లో మనోజ్ వాసుదేవ్ పార్థసాని కీలకపాత్ర పోషించారని చెబుతుంది... స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో సూత్రధారిగా భావిస్తున్న యోగేశ్ గుప్తాకు ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. వీళ్లను త్వరలోనే అదుపులోకి తీసుకుని ప్రశ్నించనుంది. 


టిడ్కో ఇళ్ల నిర్మాణంలో ఇష్టానుసారం రేట్లు పెంచి.. కాంట్రాక్స్‌ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారని ఇప్పటికే వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆదాయపు పన్ను శాఖ నాలుగేళ్లుగా విచారణ జరుపుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లోనూ భారీగా అవినీతిని జరిగిందన్న అభియోగాలు ఉన్నాయి. ఈ రెండు స్కామ్‌లలో చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్ పాత్ర ఉన్నట్టు అభియోగాలు నమోదు చేసింది. రెండు స్కాంలలో డబ్బులు చేరింది చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ దగ్గరకే అని భావిస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. దీంతో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ స్కాంలో ఇంకా ఎవరెవరుఉన్నారు... వారి మధ్య ఉన్న సంబంధాలు ఏంటి..? వారి మధ్య జరిగిన సంభాషణలు ఏంటి..? అనే అంశాలపై ఏపీ సీఐడీ దృష్టి పెట్టిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ల లింకులు దుబాయ్‌ వరకు ఉన్నట్టు ఆరోపిస్తున్నాయి. దుబాయిలోనూ డబ్బు అందుకున్నారని అనుమానంతో దానిపై కూడా ఫోకస్‌ పెట్టారట. త్వరలో దుబాయికి విచారణ బృందాన్ని పంపనుంది ఏపీ ప్రభుత్వం. 


8వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్ పనులు అప్పగించిన షాపూర్జీ పల్లోంజీ, లార్సన్ అండ్ టూబ్రో సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పీఏ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా 118 కోట్ల రూపాయలు తీసుకున్నారని విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎవరికీ దొరక్కుండా ఉండటానికి కోడ్ లాంగ్వేజ్‌ను వినియోగించారని దుయ్యబడుతున్నారు. ఈ కేసులో ఐటీ అధికారులు ఆగస్టు 4న చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన సంగతి ఓ ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది.


దీని ఆధారంగా ఇప్పటికే పెట్టిన కేసులను మరింత టైట్ చేయాలని ఏపీ సీఐడీ అధికారులు భావిస్తున్నారట. ఆదాయపు పన్ను చెప్పిన వివరాలతో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కాంకు సంబంధం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. రెండింటిలో విచారణ కోసం త్వరలోనే దుబాయి వెళ్లనున్న దర్యాప్తు బృందం.. తర్వాత ఏం చేయబోతుందో అన్న ఆసక్తి మొదలైంది. మరోవైపు, చంద్రబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నారు. ఐటీ నోటీసులకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందే అని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. చంద్రబాబుపై ఘాటు విమర్శలు సంధిస్తున్నారు. 


దీనిపై చంద్రబాబు నోరు తెరవాలని వైసీపీ నేతలు గత వారం రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. వచ్చిన ఐటీ నోటీసులను టీడీపీ అధినేతతోపాటు లీడర్లంతా లైట్ తీసుకుంటున్నారు. వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన పని లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.