వేసవిలో మండుటెండలు... అత్యధిక ఉష్ణోగ్రతలు సర్వసాధారం. కానీ, వర్షాకాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడం...అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెడ్‌ అలర్ట్‌లు, అరెంజ్‌ అలర్ట్‌లు కూడా జారీ అయ్యాయి. వాగులు-వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కానీ, ఢిల్లీలో వాతావరణం... కాస్త వెరైటీగా ఉంది. వానాకాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. వేడి గాలులు... 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత అక్కడి ప్రజలను ఇబ్బంది పెట్టింది. 


సెప్టెంబర్‌ నెలలో ఢిల్లీలో నమోదైన ఉష్ణోగ్రత ఒక రికార్డు. ఈనెలలో ఎండలు 40 డిగ్రీలు దాటడం.. 85ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1938 సెప్టెంబరు 16న 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ఆ స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. సోమవారం.... ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ప్రాంతంలో ఏకంగా 40.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రుతుపవనాల బలహీనత వల్ల ఉష్ణోగ్రతలు పెరిగాయని అంటున్నారు వాతావరణ నిపుణులు. పొడి వాతావరణం ప్రభావం వ‌ల్ల కానీ.. ఎల్ నినో సంవత్సరం ప్రభావం వ‌ల్ల కానీ.. అత్యధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతాయ‌ని చెప్తున్నారు. 


సోమవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికంగా.. 40.1 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదైంది. ఆదివారం 37.2 డిగ్రీలు నమోదుకాగా... 24 గంటల్లోనే ఉష్ణోగ్రత మూడు డిగ్రీలు పెరిగిందని చెప్తున్నారు ఢిల్లీ వాతావరణ శాఖ అధికారులు. సోమవారం అత్యధికంగా 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనా.. మంగళవారం మాత్రం ఎండ తగ్గింది. వర్షం కురవడంతో... గరిష్ట ఉష్ణోగ్రత 36డిగ్రీలుగా ఉంది. సాయంత్రం తేలికపాటి వర్షం పడటంతో... కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు చేరింది.


ఢిల్లీలో ఆగస్టులో 61 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సాధారణంగా గతంలో ఆగస్టులో అత్యంత వర్షపాతం ఉండేది. కానీ.. గతంతో పోలిస్తే.. సెప్టెంబరు 4వ తేదీ వరకు 32.4 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఆ తర్వాత వర్షాలు పడలేదు. దీంతో ఈనెల 5న.. అంటే సోమవారం అత్యధిక ఉష్ణోగ్రత రికార్డ్‌ అయ్యింది. బుధవారం కూడా తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని కారణంగా... ఉష్ణోగ్రతలో కాస్త తగ్గుదల ఉంటుందని అంచనా వేస్తోంది. సెప్టెంబర్ 7 నుండి 10 వరకు వాతావరణం పొడిగా ఉంటుంది.. మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో గరిష్ట ఉష్ణోగత్ర 35 డిగ్రీలు.. కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉంటుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈసారి జులై, ఆగస్టులో కూడా 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. కానీ సెప్టెంబరులో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటడం వాతావరణ నిపుణులు కూడా ఆశ్చర్యపరుస్తోంది.