తను మంత్రిగా ఉన్న శాఖనే మర్చిపోయి కొద్దిసేపు గందరగోళానికి గురయ్యారు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఇటీవల పట్నాలో జరిగిన జనతా దర్బార్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దర్బార్‌లోని ఓ సమస్య విని రాష్ట్ర హోం మంత్రికి ఫోన్ చేయండి అంటూ అధికారులను ఆదేశించారు. తానే హోంమంత్రిని అనే విషయం మర్చిపోవడంతో అధికారులకు ఏం చేయాలో అర్థంకాక కొద్దిసేపు తడబడ్డారు. తన శాఖను మర్చిపోవడమే కాకుండా హోం మంత్రితో నేను ఇప్పుడే మాట్లాడాలి వెంటనే ఫోన్ చేయండి అంటూ అధికారులకు గట్టిగా చెప్పారు. దీంతో గందరగోళం నెలకొంది.
నితీశ్ అలా అడిగే సరికి ఏం చేయాలో అర్థం కాని అధికారి రెండుసార్లు ఎవరికి కాల్ చేయాలి అని అడిగారు. దీంతో విసుగుచెందిన నితీశ్ కుమార్ పక్కన హాలులో కూర్చున్న మంత్రివైపు చూపిస్తూ తనను పిలవండి, తనకు ఫోన్ కలపండి అంటూ అధికారులకు చెప్పారు. సర్ ఆయన విజయ్ చౌదరి అని అధికారులు చెప్తారు. అవును ఆయనకే కాల్ చేయండి అని నితీశ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విషయం బయటకు వచ్చింది.
అయితే నితీశ్ పిలిచిన విజయ్ చౌదరి రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ, పార్లమెంటరీ అఫైర్స్ మంత్రి. అయినప్పటికీ అధికారులు విజయ్ చౌదరికి ఫోన్ చేసి నితీశ్‌కు అందించారు. అప్పుడు మళ్లీ నితీశ్ అధికారులతో ఎవరికి కాల్ చేశారు అని అడుగుతారు. వారు అక్కడ కూర్చున్న మంత్రి విజయ్ చౌదరికి అని చెప్తారు. అప్పుడు నితీశ్ మళ్లీ 'నో, ఆయన కాదు' అని అంటారు. మొత్తానికి నితీశ్ కుమార్ బాగా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో నితీశ్‌పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి సోమవారం పట్నాలో జరిగిన జనతా దర్బార్ లో పాల్గొని ప్రజల సమస్యలను విన్నారు. ఈ సమయంలో ఈ ఘటన జరిగింది. ఆయన దాదాపు 51 మంది సమస్యలను విని సంబంధిత అధికారులకు వాటిని పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు.