Sonia Letter To PM: దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చుతారనే ప్రచారం వేళ మంగళవారం (సెప్టెంబర్ 5) నాడు I.N.D.I.A కూటమి నేతలు అత్యవసరంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోనియా గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయాలని నిర్ణయించినట్లు సమాచారం. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి మొదలయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి అని అడగటంతో పాటు వివిధ సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. 24 పార్టీల ప్రతిపక్ష కూటమి I.N.D.I.A తరఫున మరికొన్ని రోజుల్లో లేఖ రాస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 


దేశం పేరు మార్చనున్నారన్న వేళ I.N.D.I.A కూటమి అత్యవసరంగా సమావేశమైంది. కాంగ్రెస్ పార్లమెంటరీ లీడర్లు సోనియా గాంధీ నివాసంలో సమావేశం అయ్యారు. అనంతరం ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే నివాసంలో I.N.D.I.A కూటమికి చెందిన నేతలు భేటీ అయ్యారు. ఇండియా అనే పేరును రాజ్యాంగం నుంచి తొలగించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు కూటమి నేతలు మూకుమ్మడిగా చెప్పినట్లు సమాచారం. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను బహిష్కరించాలని కొన్ని చిన్న పార్టీలు సూచించగా అయితే పెద్ద పార్టీలు మాత్రే ఆ సూచనలను తిరస్కరించినట్లు తెలుస్తోంది. సానుకూల అజెండాతో ప్రత్యేక సమావేశాలకు రావాలని నిర్ణయించుకున్నట్లు ఓ పార్టీ నాయకుడు తెలిపారు. 


పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఎందుకు పెడుతున్నారో కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత లేదని, ఈ ప్రత్యేక సెషన్ ప్రత్యేకత ఏమిటో దేశానికి తెలియదని, బీజేపీ అజెండా ఏమిటో దేశానికి చెప్పాలని కూటమి నాయకుడు ఒకరు డిమాండ్ చేశారు. అయితే ఈ ప్రత్యేక సమావేశాల్లో కూటమి పక్షాలు ఏకాభిప్రాయంతో చర్చించేలా మల్లిఖార్జున్ ఖర్గే కొన్ని అంశాలను ప్రకటించారు. అదానీ గ్రూప్ పై తాజా ఆరోపణలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, మణిపూర్ లో హింసాత్మక పరిస్థితి, కాగ్ రిపోర్టు, అధిక కనీస మద్దతు ధర డిమాండ్, ఫెడరల్ ఏజెన్సీల దుర్వినియోగంపై చర్చించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలనని 28 పార్టీల నాయకులు నిర్ణయించినట్లు సమాచారం. 


కూటమి పేరు భారత్ గా మార్చితే - కేజ్రీవాల్


వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ‘I.N.D.I.A’ కూటమిగా ఏర్పడ్డ విపక్షాలకు మోకాలడ్డిన చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘I.N.D.I.A’ కూటమి పేరు సమస్యగా ఉన్నందున ‘భారత్‌’గా మార్చుకుంటే, మరి ‘భారత్‌’ స్థానంలో భారతీయ జనతా పార్టీ మరేదైనా పేరు పెట్టుకుంటుందా? అని ప్రశ్నించారు.


దేశం 140 కోట్ల మంది ప్రజలది, కేవలం ఒక పార్టీది కాదు అంటూ మండిపడ్డారు. అలాగే ఇంకా ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఒక వేళ విపక్ష కూటమి పేరును ఇండియా నుంచి భారత్‌ అని మార్చితే అప్పుడు ఏం చేస్తారంటూ ప్రశ్నించారు. తాము కూటమి పేరును భారత్‌గా మారిస్తే మీరు దేశం పేరును బీజేపీగా మారుస్తారా అంటూ అడిగారు.