'వెళ్లిపోమాకే' సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయమయ్యారు విశ్వక్ సేన్. ఆ తరువాత 'ఈ నగరానికి ఏమైంది' అనే సినిమా చేశారు. ఈ సినిమాలో అతడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. 2019లో 'ఫలక్‌నుమాదాస్' చిత్రంతో దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా కూడా మారారు. ఆ సినిమాలో హీరో కూడా అతనే. ఆ సినిమా విశ్వక్ సేన్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తరువాత వచ్చిన 'హిట్' సినిమా హిట్టు కొట్టడంతో హీరోగా నిలబడ్డాడు విశ్వక్. ప్రస్తుతం మూడ్నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.

రీసెంట్ గా అతడు నటించిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాకి హిట్ టాక్ రావడంతో అతడు మరింత జోష్ తో తన సినిమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. కొన్నిరోజుల క్రితం 'దాస్ కా దమ్కీ' అనే సినిమా అనౌన్స్ చేశారు విశ్వక్ సేన్. ముందుగా ఈ సినిమాకి దర్శకుడిగా నరేష్ కుప్పిలిని తీసుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందో కానీ అతడు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో దర్శకత్వ బాధ్యతలు విశ్వక్ సేన్ చేపట్టారు. 

 

ఇప్పటికే 95% చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించింది చిత్రబృందం. అలానే ఈ సినిమాను మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక మిగిలిన సినిమా షూటింగ్ ను ఒక వారంలో పూర్తి చేయనున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'హరిహర వీరమల్లు' చిత్రాలకు స్టంట్స్ కొరియోగ్రఫీ చేసిన బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్-జుజితో చిత్రబృందం సినిమా క్లైమాక్స్ ఫైట్‌ ను చిత్రీకరిస్తోంది. హైదరాబాద్‌ లోని సారధి స్టూడియోస్‌ లో వేసిన భారీ సెట్‌ లో షూటింగ్ జరుగుతోంది.

ఫుకెట్‌ లో ఒక నెల షూటింగ్ షెడ్యూల్‌ ను, స్పెయిన్‌ లో ఒక చిన్న షెడ్యూల్‌ ను టీమ్ పూర్తి చేసుకుంది. దీపావళి కి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేసి ప్రమోషన్స్‌ను ప్రారంభించనున్నారు. బింబిసార చిత్రానికి పనిచేసిన రామకృష్ణ మాస్టర్ యాక్షన్ ఎపిసోడ్‌ కు కొరియోగ్రఫీ చేయగా వెంకట్ మాస్టర్ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్‌ ను పర్యవేక్షించారు. ఈ సినిమాలో నివేతా పేతురేజ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి దినేష్ బాబు ఛాయాగ్రాహకుడు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందించారు.

 

డ్యూయల్ రోల్ లో విశ్వక్ సేన్: 

ఈ సినిమాలో విశ్వక్ సేన్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అందులో ఒకటి హీరో రోల్ కాగా.. మరొకటి విలన్ రోల్ అని సమాచారం. కథ ప్రకారం.. హీరో, విలన్ రెండూ విశ్వక్ సేనే. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో తన తండ్రిని నిర్మాతగా పెట్టి సినిమా చేస్తున్నారు ఈ యంగ్ హీరో. మరి ఈ సినిమా అతడికి ఎలాంటి హిట్ ను తీసుకొస్తుందో చూడాలి!