వరుస పరాజయాలతో కెరీర్ కొనసాగిస్తున్న మంచు విష్ణు, ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజిలో ఈ సినిమా రూపొందుతోంది. దిగవంగత నటుడు కృష్ణంరాజు హీరోగా తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ మూవీ ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని తిరిగి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పనులు మొదలయ్యాయి. శ్రీ కాళహస్తిలో చిత్రం బృంద పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
ప్రాపర్టీ మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన విష్ణు
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మంచు విష్ణు ఓ వీడియో సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఇందులో సినిమా కోసం ఉపయోగించే సెట్ ప్రాపర్టీస్ తయారీని చూపించారు. మొత్తం 800 మంది సెట్ తయారీ బృందం 5 నెలలు కష్టపడి ఈ ఆర్ట్ వర్క్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. 8 కంటెయినర్లకు సరిపడ సెట్ ప్రాపర్టీని న్యూజిలాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం అక్కడే పూర్తి చేయనున్నట్లు మంచు విష్ణు తెలిపారు.
రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘భక్త కన్నప్ప‘!
ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాన్ని కలెక్షన్ కింగ్ మోహన్ బాబునిర్మించబోతున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ మహాభారత సిరీస్ ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణుకి జోడిగా బాలీవుడ్ నటి నుపుర్ సనన్ ఫిక్స్ అయినా, కొన్ని కారణాలతో ఆమె తప్పుకుంది. ప్రస్తుతం మరో హీరోయిన్ ను తీసుకునే పనిలో పడింది చిత్రబృందం. పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ సినిమాకు కథను అందిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ అందిస్తున్నారు.
సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ కంప్లీట్!
ఈ మూవీ షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టనున్నట్లు మంచు విష్ణు వెల్లడించారు. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమాను రాబోయే తరాలు కూడా గుర్తుంచుకునేలా తెరకెక్కించబోతున్నట్లు మోహన్ బాబు ఇప్పటికే తెలిపారు. పాన్ ఇండియా వెలెల్ లో తెరకెక్కనున్న ఈ సినిమాను పలు భాషల్లో విడుదల చేస్తామని చెప్పారు.
‘భక్త కన్నప్ప‘ మంచు విష్ణు కెరీర్ ను మలుపు తిప్పేనా?
గత కొంత కాలంగా మంచు విష్ణు వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన చివరిగా నటించిన ‘మోసగాళ్లు, ‘జిన్నా’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా మిగిలాయి. ఈ నేపథ్యంలో ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ‘భక్త కన్నప్ప’ సినిమా చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాతో మంచు విష్ణు కెరీర్ మారిపోయే అవకాశం ఉందని సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు.
Read Also: విదేశీ వాయిద్యాలతో - 'డెవిల్' పాట వెనుక కథ తెలుసా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial