కోలీవుడ్ హీరో విశాల్ షూటింగ్ లో గాయపడ్డారు. హైదరాబాద్ లో 'లాఠీ' సినిమా క్లైమాక్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన గాయపడినట్లు తెలుస్తోంది. విలన్ బారి నుంచి చిన్నారిని కాపాడే సన్నివేశంలో భాగంగా హీరో బిల్డింగ్ మీద నుంచి దూకాలి. ఈ క్రమంలో అతడి చేతికి, నుదుటికి గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో విశాల్ షూటింగ్ కి బ్రేక్ చెప్పి ట్రీట్మెంట్ కోసం కేరళకు వెళ్లారు. 


చేతికి చిన్న ఫ్రాక్చర్స్ కావడంతో షూటింగ్ ను మార్చి నెలకు వాయిదా వేశారు. ఈ విషయాన్ని విశాల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. చేతికి ఫ్రాక్చర్‌ అవడంతో ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఆయనకు ఎలా గాయమైందో వీడియో కూడా షేర్ చేశారు.


ఈ వీడియో చూసిన అభిమానులు విశాల్ త్వరగా  కోలుకోవాలని ట్విట్టర్‌లో కామెంట్స్ చేస్తున్నారు. అలానే విశాల్ చేతిలో ఉన్న ఆ చిన్నారి బాగానే ఉన్నాడా..? లేదా..? అని ఆరా తీస్తున్నారు. ఇలాంటి రిస్కీ సీన్స్ లో నటించొద్దంటూ విశాల్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.


సునయన హీరోయిన్ గా నటిస్తుండగా.. వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రమణ, నంద కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విశాల్ నటించిన 'సామాన్యుడు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కనీసం 'లాఠీ' సినిమాతోనైనా సక్సెస్ అందుకుంటారేమో చూడాలి!