Vijay Deverakonda Hilarious Phone Conversation with his brother Anand Deverakonda: విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఆనంద్ దేవరకొండ. ఆయన ‘బేబీ’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఆనంద్ రేంజి ఓ రేంజికి పెరిగిపోయింది. ఆయన తర్వాత ప్రాజెక్టులపై ప్రేక్షకులలో అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆనంద్ హీరోగా నటించిన ‘గం గం గణేశా’ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. దీనికి ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించారు. ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా హీరోయిన్లుగా నటించారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సరికొత్త లుక్, అదిరిపోయే పంచ్ డైలాగులతో ఆనంద్ అదుర్స్ అనిపిస్తున్నాడు. వినాయ విగ్రహం చుట్టూ తిరిగే ఈ సినిమాలో ఆయన దొంగలా కనిపించబోతున్నాడు. తాజాగా నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్ లో తన వాయిస్, తన అన్నయ్య విజయ్ వాయిస్ ఒకేలా ఉంటుంది అనే ప్రశ్నకు ఆనంద్ సమాధానం చెప్పాడు. ఇదే సమయంలో ఫోన్ కాల్ లో అందుబాటులోకి వచ్చిన విజయ్ కీలక విషయాలు వెల్లడించాడు. “కొద్ది రోజుల నుంచి చాలా మంది అడుగుతున్నారు. వాయిస్ సేమ్ ఉంటుంది. యాక్టింగ్ కూడా అలాగే ఉంటుంది అంటున్నారు. నాకైతే ఆ విషయం తెలియదు” అన్నారు.


గర్ల్ ఫ్రెండ్స్ ను ఫ్రాంక్ చేసే వాళ్లం- విజయ్


'ఇద్దరి వాయిస్ ఒకేలా ఉంటుందా? లేదా?' అని అడిగేందుకు విజయ్ కి ఆనంద్ ఫోన్ చేశారు. అప్పుడు ఇద్దరి వాయిస్ ఇంచుమించు ఒకేలా ఉంటుందని విజయ్ చెప్పారు. “అవును మా వాయిస్ కొంచెం సేమ్ ఉంటుంది. చిన్నప్పుడు మమ్మిని పిలవగానే నేనా? చిన్నోడా? అని కన్ఫ్యూజ్ అయ్యేది. అప్పుడే నాకు అర్థం అయ్యింది. ఇద్దరి వాయిస్ సేమ్ లా ఉంటుందని. ఆ తర్వాత మా వాయిస్ ని చాలా రకాలుగా వాడాం. ఫ్రెండ్స్ ను, గర్ల్ ఫ్రెండ్ ను ఫ్రాంక్ చేయడానికి వాడాం. నా ఫోన్ తీసుకుని ఆనందే ఫ్రాంక్ లు చేసేవాడు. నా వాట్సాప్ లో వాయిస్ నోట్ లు రాగానే తనే రిఫ్లై ఇచ్చేవాడు. ఫోన్ కాల్ వస్తే, తనే ఎత్తి మాట్లాడే వాడు. నా సినిమా డబ్బింగ్ కు కూడా తననే పంపిద్దామని ట్రై చేశా. ‘గం గం గణేశా‘ ట్రైలర్ చాలా నచ్చింది. చాలా ఫన్ అనిపించింది. కన్ఫ్యూజన్, కామెడీ, ఆనంద్ ఫర్ఫర్మెన్స్ బాగుంది. నేను హ్యాపీగా ఫీలవుతున్నాను” అన్నారు.


మే 31న విడుదలకు రెడీ అవుతున్న ‘గం గం గణేశా’


వెన్నెల కిశోర్, జబర్దస్త్ ఇమ్మానుయేల్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ‘గం గం గణేశా’ చిత్రాన్ని హై లైఫ్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై కేదార్‌‌‌‌‌‌‌‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. మే 31న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


Read Also: విజయ్ దేవరకొండతో సుకుమార్ మూవీ- క్రేజీ అప్ డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్!