తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్(Siva Karthikeyan) నటించిన తొలి స్ట్రయిట్ తెలుగు సినిమా 'ప్రిన్స్'(Prince). ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. శివకార్తికేయన్ 20వ సినిమా (SK20) ఇది. ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన ఉక్రెయిన్ బ్యూటీ మరియాను హీరోయిన్ గా తీసుకున్నారు. ఒక భారతీయ కుర్రాడు, వేరే దేశానికి చెందిన అమ్మాయిని ప్రేమించడం వల్ల జరిగే సమస్యలను ఈ సినిమాలో ఫన్నీగా చూపించారు.
జాతిరత్నాలు సినిమాతో మంచి కామెడీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనుదీప్ కేవీ(Anudeep KV) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈయనకు ఇది రెండో చిత్రం. అక్టోబర్ 21వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. దీనికి టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి గెస్ట్ లుగా రానున్నారు. వారితో పాటు హరీష్ శంకర్ కూడా రాబోతున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది. మంగళవారం నాడు ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.
''ఆఫ్గనిస్తాన్, కజికిస్థాన్, ఉజ్బేకిస్థాన్, అంటార్కిటికాలో విడుదల చేయాలనుకున్నా... ఆఫ్గనిస్తాన్‌లో థియేటర్లు లేవు... కజికిస్థాన్‌లో డిస్ట్రిబ్యూటర్లు లేరు... ఉజ్బేకిస్థాన్‌లో మార్కెట్ లేదు. అందుకని, తెలుగు - తమిళ భాషల్లో విడుదల చేస్తున్నాం'' అంటూ శివ కార్తికేయన్, కేవీ అనుదీప్, సత్యరాజ్, హీరోయిన్ మరియా విడుదల చేసిన ఇప్పటికే చాలా వైరల్ అయింది.
థమన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. టాలీవుడ్‌లో టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు అయిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. శాంతి టాకీస్ నిర్మాణ భాగస్వామిగా ఉంది. నారాయణ్ దాస్ కె. నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాకు నిర్మాతలు. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు.
'సీమ రాజా', 'రెమో', 'డాక్టర్', 'డాన్' సినిమాలతో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే దగ్గరయ్యారు. అందుకే ఇప్పుడు స్ట్రెయిట్ సినిమాతో అలరించడానికి సిద్ధమయ్యారు. మరి ఈ సినిమా అతడికి ఎలాంటి సక్సెస్ ను తీసుకొస్తుందో చూడాలి. తెలుగుతో పాటు తమిళంలో కూడా అగ్రెసివ్ ప్రమోషన్స్ చేయడానికి రెడీ అయింది చిత్రబృందం.