మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరమో, కంటినిండా నిద్ర కూడా అంతే అవసరం. అయితే మంచి నిద్ర అనగానే మనకు గుర్తుకు వచ్చేది మెత్తటి పరుపు, దిండు.. ముఖ్యంగా దిండు లేనిదే నిద్ర పట్టడం చాలా కష్టమని అనుకుంటుంటారు. కానీ, ఆ దిండు వల్లే అనేక సమస్యలు ఎదుర్కోవాలని ఎప్పుడైనా ఆలోచించారా? సరైన దిండును కనుక వాడకపోతే నిద్రలేమి ఒక్కటే కాదు, మెడనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు తీవ్రతరం అవుతాయని చెబుతున్నారు పరిశోధకులు.
మెడనొప్పి, వెన్నునొప్పి రావడం
ఇప్పుడు మనలో చాలామందికి వెన్నునొప్పి వస్తోంది. దానికి కారణం సరైన పరుపు లేకపోవడం, సరైన పద్థతిలో పడుకోకపోవడం ఒకటైతే సరైన దిండు కూడా ఒక కారణం. మన వెన్నుపూస నరానికి, దిండుకు సరైన దిశ లేకుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇంకా అలాగే ఉంటే ఈ సమస్య మరింత తీవ్రతరం కూడా కావచ్చు. అందుకే సరైన పిల్లో ఎన్నుకోవడం తప్పనిసరి.
అదే మనం పడుకున్నప్పుడు మెడ పరుపుకు సమాంతరంగా ఉండాలి. తల కింద దిండు పెట్టుకుంటే మెడ ఎత్తుగా అయినా ఉంటుంది, కిందకైనా ఉంటుంది. దీనివల్ల నెక్ పెయిన్ కూడా వస్తుంది. ఒకవేళ మనం వాడుతున్న పిల్లో సరైనది కాకపోతే నెక్ పెయిన్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.. స్పాండలైటిస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి పర్మినెంట్ సొల్యూషన్ కూడా అందుబాటులో లేదు.
నిద్రలేమి సమస్యలు వేదిస్తాయ్!
చాలామందిని బాధించే సమస్య నిద్రలేమి. చాలా మంది నిద్రలేమి కారణంగా డిప్రెషన్, ఒత్తిడికి, ఓబేసిటీకి గురవుతున్నారు. దీనివల్ల అనేక మానసికమైన, శారీరకమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొందరు గురక సమస్యతోనూ బాధపడుతున్నారు. దీనివల్ల సీపాప్ మిషన్లు, బీ పాప్ మిషన్లు లాంటివి పెట్టుకోవాల్సి వస్తుంది. నిద్ర సరిగ్గా పట్టకపోవడానికి అనేక కారణాలున్నప్పటికీ మనం వాడే తలగడ కూడా అందులో ప్రాధాన్యత పోషిస్తుంది. అందుకే సరైన దిండును ఉపయోగిస్తే ఈ సమస్య నుంచి దూరం కాగలం. డాక్టర్లు చెప్పే సూచన ఏంటంటే మీ దిండును కొనుగోలు చేసేటప్పుడు అది కిందకీ, పక్కకీ ఇలా ఒకవైపే వంగిపోకుండా ఉండకుండా మీ పరుపుకు సమాంతరంగా ఉండాలి.
1. మెడ లేదా నడుము నొప్పులు, సర్వైకల్ నొప్పులు ఉన్నవాళ్లు వాటి అవసరాలకు అనుగుణంగా వాటి మీద ప్రభావితం చేసే సర్వైకల్ పిల్లోలను కొనుగోలు చేస్తే మంచిది. ఇప్పుడు మార్కెట్లో అన్నీ షాపులలోనూ ఇవి దొరుకుతున్నాయి.
2. మన మెడ భాగం, శరీర భాగం సమాంతరంగా ఉండేలా సహజసిద్ధ రబ్బరుతో తయారు చేసిన ఫోమ్ దిండ్లను కొనుగోలు చేస్తే బెటర్.
3. ఫెదర్ (వివిధ రకాల ఈకలతో)తో చేసిన దిండ్లు చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. కానీ వాటివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా అవి మెడ నొప్పిని కలగిస్తాయి. కాబట్టి వాటిని వీలైనంత వాడకపోవడమే మంచిది.
4. కేవలం తలకింద మాత్రమే కాకుండా మీ పక్కలలో, లేదా కాళ్ల కింద దిండులను ఉపయోగించడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరిగి సుఖమైన నిద్ర పట్టే అవకాశం ఉంది.
5. అలాగే దిండ్లను కనీసం ప్రతీ సంవత్సరానికి ఒకసారి మారిస్తే చాలా మంచిది. ఎంత శుభ్రంగా క్లీన్ చేసినా అందులో ఉండే దూదిలో ఎక్కడో ఒకమూల బ్యాక్టీరియా కొంచెం దాగి ఉంటుంది. అది వాడుతున్న కొద్దీ ఎక్కువ అవుతుంది. దాంతో దగ్గు, జలుబు, ఎలర్జీ, ఆస్తమాలాంటి వాటికి కారణం అవుతుంది.