యువ కథానాయకుడు రాహుల్ విజయ్, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని (Shivani Rajasekhar) జంటగా నటించిన చిత్రం 'విద్య వాసుల అహం' (Vidya Vasula Aham Movie). ఏ లాంగ్ లాంగ్ ఈగో స్టోరీ... అనేది ఉపశీర్షిక. ఈ రోజు సినిమాలో తొలి పాట విడుదల చేశారు.
హే ఎవరో...
సునీత గానంలో!
'విద్యా వాసుల అహం' చిత్రంలో తొలి పాట 'హే ఎవరో...'ను ఈ రోజు విడుదల చేశారు, కల్యాణీ మాలిక్ సంగీతం సమకూర్చిన ఈ పాటకు కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం అందించారు. కల్యాణీ మాలిక్, సునీత ఆలపించారు.
'హే ఎవరో...
మౌనంగా దాగుంది ఎవరో?
హే ఎవరో...
నా కోసం రానుంది ఎవరో?
ఎలా...
ఆరా తీసే దారుందో? లేదో?
పారా కాసే చూడాలేమో?
అదృష్టం వా వెంటే ఉంటే చాలు అనుకోవాలా!'' అంటూ గీతం సాగింది. ఇది పెళ్లి ముందు వచ్చే పాటగా తెలుస్తోంది. కాబోయే జీవిత భాగస్వామి గురించి ఇద్దరూ ఊహల్లో తేలే సందర్భంలో వచ్చే గీతమిది.
సంక్రాంతికి సినిమా విడుదల
సంక్రాంతి సందర్భంగా జనవరి 14న సినిమాను విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం దర్శక నిర్మాతలు వెల్లడించారు. బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి', చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', విజయ్ 'వారసుడు', అజిత్ 'తునివు' మధ్య విడుదల అవుతున్న చిన్న చిత్రమిది. దీనికి ఎన్ని థియేటర్లు లభిస్తాయి? దీనికి ప్రేక్షకుల నుంచి ఎటువంటి ఆదరణ లభిస్తుంది? పెద్ద పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమా ఏ విధంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది? అనేది చూడాలి.
శివాత్మికతో హిట్... ఇప్పుడు శివానితో!
ఓటీటీలో విడుదలైన 'అద్భుతం' సినిమా, 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్‌తో శివానీ రాజశేఖర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోగా రాహుల్ విజయ్ ప్రామిసింగ్ మెటీరియల్ అనిపించుకున్నారు. ఈ మధ్య విడుదలైన 'పంచతంత్రం'లో ఆయన, శివాత్మిక జంటగా కనిపించారు. హిట్ అందుకున్నారు. ఇప్పుడు శివాత్మిక అక్క శివానితో సంక్రాంతికి థియేటర్లలోకి జంటగా వస్తున్నారు.
Also Read : టికెట్ రేట్స్ మీద బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు - 'తారకరామ' థియేటర్ పునఃప్రారంభంలో నందమూరి నాయకుడు ఏమన్నారంటే?
పెళ్ళైన కొత్తలో జంట మధ్య ఈగోలు వస్తే?
'విద్య వాసుల అహం'లో విద్య పాత్రలో శివాని రాజశేఖర్, వాసుగా రాహుల్ విజయ్ కనిపించనున్నారు. పెళ్ళైన కొత్తలో జంట మధ్య ఈగోలు వస్తే? అనే కథాంశంతో సినిమా రూపొందింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేశారు. నగర శివరాల్లో సినిమా కోసం ప్రత్యేకంగా ఓ ఇంటి సెట్ వేశారు. అందులో మెజారిటీ సీన్స్ తీశారని సమాచారం. ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రమిదని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
'తెల్లవారితే గురువారం' తర్వాత...
ఈ చిత్రానికి మణికాంత్ గెల్లి దర్శకుడు. 'తెల్లవారితే గురువారం' తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. ఏటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 2గా సినిమా రూపొందింది. లక్ష్మీ నవ్య మక్కపాటి, రంజిత్ కుమార్ కొడాలి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత : మహేష్ దత్త మోటూరు, కూర్పు : సత్య గిడుటూరి, ఛాయాగ్రహణం : అఖిల్ వల్లూరి, రచన: వెంకటేష్ రౌతు.