సినిమా టికెట్ల ధరలపై నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులు అందరికీ టికెట్ రేట్లు అందుబాటులో ఉండటం ఇండస్ట్రీకి  ఆరోగ్యకరమని ఆయన అన్నారు. స్వర్గీయ విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు చేతులు మీదుగా మొదలైన 'తారకరామ' థియేటర్ బుధవారం పునః ప్రారంభమైంది. ఆ కార్యక్రమంలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే... 


నందమూరి ఫ్యామిలీకి చెందిన కాచిగూడలోని 'తారకరామ' థియేటర్‌ను బుధవారం ఎంతో వైభవంగా పునః ప్రారంభించారు బాలకృష్ణ. నందమూరి తారక రామారావు మీద ఉన్న అభిమానంతో లెజెండరీ ఫిల్మ్ పర్సనాలిటీ నారాయణ్ కె దాస్ నారంగ్ కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్  'ఏషియన్ తారకరామ' థియేటర్‌ను పునరుద్ధరించారు. ఆ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ ''సునీల్ నారంగ్ గారు అందరికీ అందుబాటు ధరలో టికెట్ రేట్లు ఉంటాయని చెప్పారు. ఇది ఇండస్ట్రీకి ఎంతో ఆరోగ్యకరమైనది. ఇప్పుడు ఓటీటీ రూపంలో చిత్ర పరిశ్రమ పోటీ ఎదుర్కొంటోంది.  ఎంత మంది థియేటర్లకు వస్తారు? ఎన్నిసార్లు సినిమా చూస్తారు? అనేది ప్రశ్న. మంచి సినిమాలు అందిస్తే... ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారు. మంచి సినిమాలు తీయడం మన తెలుగు చిత్రసీమ ప్రత్యేకత. పాన్ ఇండియా స్థాయికి మన చిత్ర పరిశ్రమ ఎదిగింది. ఇలాగే మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు వర్ధిల్లుతూ ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా'' అని అన్నారు  
  
'తారకరామ' థియేటర్‌కు గొప్ప చరిత్ర ఉంది : బాలకృష్ణ
తారకరామ థియేటర్ అమ్మ నాన్నగారి పేర్లు కలిసి వచ్చేటట్టు కట్టిన దేవాలయం అని బాలకృష్ణ అన్నారు. ఈ థియేటర్‌కు గొప్ప చరిత్ర ఉందని ఆయన తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''1978లో 'అక్బర్ సలీం అనర్కాలి'తో ఈ థియేటర్‌ను ప్రారంభించాం. అనివార్య కారణాల వల్ల ఆ తర్వాత కొన్ని రోజులు ప్రదర్శనలు ఆగాయి. 1995లో మళ్ళీ ప్రారంభించాం. మూడోసారి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. ఈ థియేటర్‌లో హిందీ సినిమా 'డాన్' 525 రోజులు ఆడింది. 'మంగమ్మ గారి మనవడు', 'ముద్దుల మావయ్య', 'ముద్దుల కృష్ణయ్య', 'అనసూయమ్మ గారి అల్లుడు' - నా సినిమాలు అన్నీ బాగా ఆడాయి. మా అబ్బాయి మోక్షజ్ఞ తారకరామ తేజ పేరు కూడా ఈ థియేటర్‌లో నాన్నగారు నామకరణం చేశారు. మా నాన్నగారికి, నారాయణ్ కె. దాస్ నారంగ్ గారికి నాన్నగారి సన్నిహిత సంబంధాలు ఉండేవి. వాళ్ళ అబ్బాయి సునీల్ నారంగ్ ఆ పరంపరను ముందుకు తీసుకు వెళుతున్నారు'' అని చెప్పారు. 


ఎన్టీఆర్, మా నాన్న స్నేహితులు : సునీల్ నారంగ్
''మహనీయుడు ఎన్టీఆర్ గారి పేరు మీద ఈ థియేటర్ ఉంది. ఈ రోజు బాలకృష్ణ గారు వచ్చి థియేటర్ పునః ప్రారంభించడం చాలా సంతోషం. గొప్ప చరిత్ర ఉన్న ఈ థియేటర్‌లో మళ్ళీ సిల్వర్ జూబ్లీ సినిమాలు వస్తాయి. సరికొత్త టెక్నాలజీతో థియేటర్‌ను అద్భుతంగా నిర్మించాం. 600 సీటింగ్ కెపాసిటీతో పూర్తి రెక్లయినర్ సీట్లు ఏర్పాటు చేశాం. ఎన్టీఆర్ గారు, మా నాన్నగారు మంచి స్నేహితులు. నందమూరి కుటుంబంతో మా అనుబంధం చాలా గొప్పది. భవిష్యత్తులోనూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను'' అని సునీల్ నారంగ్ చెప్పారు. 


Also Read : కీరవాణి ఇంట్లో విషాదం - ఆయనకు మాతృ వియోగం


ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత శిరీష్ , నందమూరి మోహన్ కృష్ణ, నిర్మాతల మండలి సెక్రటరీ టి. ప్రసన్న కుమార్, సదానంద్ గౌడ్, భరత్ నారంగ్, దర్శకులు వైవీఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.